పాక్ లో మహిళా టిక్‌టాకర్‌పై 300 మంది దాడి

పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా టిక్‌టాకర్‌పై దాడి చేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ మహిళా టిక్‌టాకర్‌ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్‌లోని మినార్‌ ఇ- పాకిస్తాన్‌ వద్ద టిక్‌టాక్‌ వీడియోను చిత్రీకరించడానికి వెళ్లారు. 

ఆ సమయంలో వారిని దాదాపు 300 మంది చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. వారి నుంచి ఆమె తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి పరిస్థితిని గమనించిన అక్కడి సెక్యూరిటీ గార్డు మినార్‌ ఇ- పాకిస్తాన్‌ గేటు తెరవడంతో తన స్నేహితులు, ఆమె ఎలాగోలా తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. 

వారిపై దాడికి పాల్పడినవారు ఆమె ఉంగరం, చెవి రింగులు, స్నేహితుల వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌, ఐడీ కార్డు 15 వేల రూపాయలను లాక్కున్నారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మహిళా టిక్‌టోకర్ తన ఫిర్యాదులో తాను, తన  సహచరులు గుంపు నుండి తప్పించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదని తెలిపారు. పార్క్ సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ చుట్టూ ఉన్న ఆవరణకు గేట్ తెరిచి తమకు సహాయం చేయడానికి ప్రయత్నించాడని చెప్పింది.

“అయితే, జనం భారీగా ఉన్నారు. ప్రజలు ఆవరణను స్కేల్ చేసి మా వైపు వస్తున్నారు. ప్రజలు నా దుస్తులను చింపివేసేంత వరకు నన్ను నెట్టడం, లాగడం జరిగింది. చాలా మంది నాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు, కానీ జనం చాలా ఎక్కువగా ఉన్నారు వారు నన్ను గాలిలోకి విసిరేస్తూ వేధించారు” అంటూ ఆమె చెప్పింది.

కేసు నమోదు చే కున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.