సీబీఐ విచారణలో వైసీపీ ఎంపీ అవినాష్ తండ్రి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైసీపీ పులివెందుల ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కరరెడ్డితో పాటు ఆయన సోదరుడు పులివెందుల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డిలను అధికారులు మంగళవారం పులివెందుల పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో సుదీర్ఘంగా విచారించారు. 
 
భాస్కరెడ్డిని తొలుత ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 2.10గంటల వరకు విచారించారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రెండో విడత విచారణకు హాజరయ్యారు. ఆయన సోదరుడు మనోహర్‌రెడ్డిని మధ్యా హ్నం 2.30నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారించారు. వీరిద్దరూ సీఎం జగన్‌కు చిన్నాన్నలు అవుతారు. 

ఈ కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా భాస్కర్ రెడ్డి పేరు మొదటగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో సీసీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని మొదటి సారిగా పిలిపించారు. వివేకా హత్య వెనుక ఏఏ కారణాలు ఉన్నాయని అధికారులు విచారిస్తున్నారు. అలాగే రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై భాస్కర్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే కడప సెంట్రల్‌ జైల్‌ గెస్ట్‌హౌస్‌ కేంద్రంగా ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ సమీప బంధువు భరత్‌లను మరో బృందం విచారించింది. సునీల్‌కు నార్కో అనాలసిస్‌ పరీక్షల కోసం అనుమతి కోరుతూ పులివెందుల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్‌ వేసినట్లు తెలిసింది.

మరోవైపు వివేకా హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ ను ఇప్పటికే  సీబీఐ అధికారులు పది రోజుల పాటు విచారించారు.  కస్టడీ ముగియడంతో అతన్ని కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకి తీసుకెళ్ళి, పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పదిరోజుల విచారణలో సీబీఐ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.