అమెరికా ఘోర వైఫల్యంకు నిదర్శనం ఆఫ్గనిస్తాన్ 

తన ప్రపంచ వాణిజ్య కేంద్రపై ఉగ్రవాదులు దాడి చేయగానే ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రవాద ప్రమాదం గురించి అకస్మాత్తుగా అమెరికా కళ్ళు తెరిచింది. ఆ నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ “ఉగ్రవాదంపై యుద్ధం” ప్రకటించారు. ఈ పోరులో తమతో ఉందని వారంగా ఉగ్రవాదుల మద్దతుదారులుగానే ప్రకటించారు. 
 
వాస్తవానికి ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు స్థావరం ఏర్పర్చుకోవడానికి సహకరించింది, ఆయుధాలు, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించింది అమెరికాయే కావడం గమనార్హం. అటు రష్యా, ఇటు చైనాలను కట్టడి చేయడానికి వారిని ఉపయోగించుకోవాలి అనుకున్నారు. అయితే వారు రష్యాతో చేతులు కలపడంతో సహింపలేక పోయారు. 
 
తమపైననే దాడి చేయడంతో దిగమింగుకోలేక “ఉగ్రవాదంపై యుద్ధం” పేరుతో ఆఫ్ఘానిస్తాన్ పై దండెత్తి, స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, తమదేశంపై ప్రయోగిస్తున్నదని భారత్ ఎంతగా మొత్తుకున్నా అమెరికా పట్టించుకోలేదు. 
పైగా “ఉగ్రవాద వ్యతిరేక పోరు”లో భాగస్వామిగా ఆ దేశంపై అనేక ఆయుధాలు, ఆర్ధిక సహాయం చేస్తూ వచ్చారు. పాకిస్థాన్ వాటిని మనపైననే ఉపయోగిస్తూ వచ్చింది.
బిన్ లాడెన్‌ను వెతుక్కుంటూ వ‌చ్చి,అత‌నికి ఆశ్ర‌య‌మిచ్చిన తాలిబ‌న్ల‌ను ఏరేసి ఆ దేశాన్ని ఉద్ధ‌రిస్తామ‌ని చెప్పిన అగ్ర‌రాజ్యం ఇప్పుడు పెట్టాబేడా స‌ర్దుకొని దేశం వీడింది. తాలిబన్లను గతంలో ప్రాణం పోసిన అమెరికాను ఆఫ్ఘన్ ప్రజలు నమ్మలేదు. అందుకోసం భారత్ సహాయం అమెరికా తీసుకొంది.
 భారత్ వెళ్లి నచ్చచెబితేనే వారిని అడుగుపెట్టనిచ్చారు. భారత్ సహితం వ్యూహాత్మకంగా సైనిక పోరులో పాల్గొనకుండా, ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించింది. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ యెరుగనంతగా 50కు పైగా నాటో దేశాలు, అమెరికా నేతృత్వంలో లక్షలాది మంది సైనికులను ఆఫ్ఘన్ కు తరలించారు.
 అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చు పెట్టింది. అయితే భారీ ప్రాణనష్టం జరగడంతో అమెరికన్ల నుండి వ్యతిరేకత రావడంతో తమ సైనికులను వెనుకకు రప్పించుకొని  మార్గాల కోసం బరాక్ ఒబామా నుండి ప్రయత్నాలు ప్రయత్నించారు.
 
అమెరికా ఆఫ్ఘన్ లో శాంతిని నెలకొల్పడం కోసం వెళ్లలేదని  ఇక్కడ గమనించాలి. కేవలం తమ దేశంపై మరో ఉగ్రదాడి జరుగకుండా తాలిబన్లను అణచివేయడం ద్వారా గట్టి గుణపాఠం చెప్పడం కోసమే వెళ్లారు. తాలిబన్లు ఎక్కువగా గ్రామాలలో, కొండ ప్రాంతాలలో  స్థావరాలు ఏర్పరచు కున్నారు. వారిని అణచాలంటే సైనికులు స్వయంగా వెళ్లి దాడులు జరిపి ఉండవలసింది. 
 
అయితే అందుకు సాహసింపని అమెరికా సైనికులు కేవలం విమాన దాడులకు పరిమితం కావడంతో వారు తాలిబన్లను అణచడంలో విఫలమయ్యారు. హింసకు పాల్పడుతున్న తాలిబన్లతో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్చలు జరపడంతో అమెరికా భయపడుతున్నట్లు సంకేతం ఇచ్చిన్నట్లు అయింది. 
 
అందుకనే అమెరికా దళాలు తిరుగుముఖం పట్టడం ప్రారంభించిన నెల రోజులలోనే, వారి దళాల ఉపసంహరణకు గడువైన ఆగష్టు 31కి పక్షం రోజుల ముందుగానే తాలిబన్లు మొత్తం దేశాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇన్నాళ్లూ ఏ ల‌క్ష్యం కోసం ప‌నిచేసిందో.. ఇప్పుడ‌ది క‌ళ్ల ముందే నీరుగారిపోతున్నా.. ఏమీ ప‌ట్ట‌న‌ట్లు చోద్యం చూస్తోంది. వాస్తవానికి తాలిబన్ల కన్నా సంఖ్యలో ఆఫ్ఘన్ సైనికులు ఐదు రేట్లు (మూడు లక్షల మంది) ఉన్నారు.
 
వారికి ఆధునిక శిక్షణ కల్పించి, అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడానికి అమెరికా పెట్టిన ఖర్చు 8900 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.6.6 లక్ష‌ల కోట్లు) ఖర్చు.  రెండు ద‌శాబ్దాల పాటు ప్ర‌పంచంలోనే మేటి ఆర్మీగా పేరున్న అమెరికా.. ఆఫ్ఘ‌న్ సైన్యానికి శిక్ష‌ణ ఇస్తోంది. కానీ అలాంటి ఆర్మీని నెల రోజుల్లోపే సునాయాసంగా మ‌ట్టి క‌రిపించారు తాలిబ‌న్లు. ఛాయా చోట్ల ఆఫ్ఘ‌న్ సైనికులు క‌నీస పోరాటం కూడా లేకుండా తాలిబ‌న్ల‌కు లొంగిపోయారు. కొన్ని చోట్ల తాలిబ‌న్లు రాక ముందే త‌మ పోస్టులు వ‌దిలి పారిపోయారు.
మ‌రికొన్ని చోట్ల వాళ్ల‌తో పోరాడ‌లేక శాంతి ఒప్పందాలు చేసుకొని త‌మ ఆయుధాల‌ను అప్ప‌గించేశారు. కొన్ని ప్రావిన్స్‌ల గ‌వ‌ర్న‌ర్లే.. త‌మ భ‌ద్ర‌తా సిబ్బందికి లొంగిపోవాల‌ని ఆదేశించిన‌ట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘ‌నిస్థాన్ మిలిట‌రీ, రాజ‌కీయ నాయ‌క‌త్వం అవినీతిలో కూరుకుపోవ‌డం కూడా అక్క‌డి సైన్యాన్ని బ‌ల‌హీనం చేసింది. త‌మ సైనికుల‌ను స‌రిగా ప‌ట్టించుకోకుండా కొన్నేళ్ల పాటు అవుట్‌పోస్ట్‌ల‌లో వ‌దిలేశారు. అలాంటి ఎంతో మంది శిక్ష‌ణ పొందిన సైనికులు.. మెల్ల‌గా తాలిబ‌న్ల వైపు ఆక‌ర్షితుల‌య్యారు. 

ఇక కొన్నేళ్లుగా ప్ర‌తి నెలా వంద‌ల మంది ఆఫ్ఘ‌న్ సైనికులు మృత్యువాత ప‌డుతున్నా.. అక్క‌డి ప్ర‌భుత్వం ఏమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. అమెరికాతోపాటు ఇత‌ర అంత‌ర్జాతీయ బ‌ల‌గాల అండ ఉన్నంత వ‌ర‌కూ బ‌య‌టి ప్ర‌పంచానికి ఏమీ తెలియ‌లేదు. ఒక్కసారి వాళ్లు దేశాన్ని వీడ‌టం ప్రారంభ‌మైన త‌ర్వాత అమెరకా నిర్మించిన పేక మేడ క్ష‌ణాల్లో కూలిపోయింది.

తాలిబాన్లకు పాకిస్థాన్ సైన్యం, ముఖ్యంగా ఐఎస్ ఐ ప్రత్యక్ష సహాయం లేని పక్షంలో అంత వ్యూహాత్మకంగా ఈ దాడులు జరిగి ఉండేవి కావు. పాకిస్థాన్ ఒక వంక అమెరికాతో తాలిబన్లను శాంతిచర్చలకు రప్పిస్తున్నట్లు నటిస్తూనే, మరోవంక వారికి ఆయుధ, సైనిక సహకారాలు అందిస్తూ వస్తున్నది. ప్రపంచంలోని అన్ని కరడుకట్టిన ఉగ్రవాద బృందాలు ఇప్పుడు ఆఫ్ఘన్ లో స్థావరం ఏర్పర్చుకున్నాయి. 

రాబోయే రోజులలో ఆఫ్ఘన్, పాకిస్థాన్ లతో కూడిన ప్రాంతాలు ప్రపంచంలోనే అతి భయంకరమైన ఉగ్రవాద శిబిరంగా మారే అవకాశాలున్నాయి. అప్పుడు కేవలం భారత్ కె కాకుండా అమెరికా వంటి అగ్రరాజ్యాలకు సహితం ముప్పుగా మారగలవు. ఉగ్రవాద బృందాల మధ్య నాయకత్వ  ఘర్షణలో తీవ్రమైన అశాంతికి ఆ ప్రాంతం నెలవుగా మారే అవకాశం ఉంది. అందుకు అమెరికా మాత్రమే బాధ్యత వహించాలి.