ముక్కుమీద వేసే టీకాలకు భారత్ బయోటెక్ ట్రయల్స్

కరోనా నియంత్రణకు టీకా తయారీలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ముక్కు ద్వారా ఇచ్చే మొట్టమొదటి టీకా (నాజల్ వ్యాక్సిన్)ను తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ రెండు, మూడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి కేంద్ర నియంత్రణ సంస్థ నుంచి అనుమతి పొందగలిగింది. ఈ విషయాన్ని బయోటెక్నాలజీ విభాగం వెల్లడించింది. ఈ టీకా మొదటి ట్రయల్ 18 నుంచి 60 ఏళ్ల వారిపై నిర్వహించడం పూర్తయింది. భారత్‌లో మనుషులపై ఈ విధమైన ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి.

మోదాడు దశలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాక‌పోవ‌డంతో.. రెండు, మూడో ద‌శ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్ అనుమతి కోసం భార‌త్ బ‌యోటెక్.. కేంద్రాన్ని కోర‌గా  కేంద్రం ఓకే చెప్పింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌యారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లకు హ్యూమ‌న్‌ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌లేదు. మొద‌టిసారి హ్యూమ‌న్‌ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు అనుమ‌తి పొందిన వ్యాక్సిన్ ఇదే.

ఈ వ్యాక్సిన్‌ను జంతువుల‌లోనూ ప‌రీక్షించ‌గా పాజిటివ్ రిజ‌ల్ట్స్ వ‌చ్చాయి. జంతువుల‌లో ఈ వ్యాక్సిన్ వేసిన త‌ర్వాత యాంటీ బాడీల శాతం పెర‌గ‌డంతో మ‌నుషులపై క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు భార‌త్ బ‌యోటెక్ ముంద‌డుగు వేసింది.

కొవాగ్జిన్ టీకాను తయారు చేసిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, ముక్కు ద్వారా ఇచ్చే టీకా (బీబీవీ 154 అడినోవైరస్ వెక్టార్డ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్) ఆవిష్కరణపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే దేశం లోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయగలిగింది. ఈమేరకు గత ఏడాది సెప్టెంబరులో అమెరికా లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్‌తో సాంకేతిక పరంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్ కరోనాపై సమర్ధంగా పని చేస్తున్నట్టు ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది.