జూలై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం

వచ్చే ఏడాది జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్వహణ సవరణ నియమాలను జారీ చేసింది.

దీంతో 2020 జూలై 1 నుంచి ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులైన స్ట్రాస్, ప్లేట్లు, కప్పులు, ట్రేలు, పాలీస్టైరిన్, క్యారీ బ్యాగ్స్ వంటి వాటి తయారీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. అలాగే పాలిథిన్ సంచుల మందం 50 మైక్రాన్ల నుండి 120 మైక్రాన్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది.

పాలిథిన్ సంచుల మందంలో మార్పు రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి అమలులోకి వస్తుంది. తొలుత 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న బ్యాగ్‌లపై నిషేధం విధిస్తారు. రెండవ దశలో భాగంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథి‌న్‌ క్యారీ బ్యాగ్స్‌ను 2022 డిసెంబర్ 31 నుంచి నిషేధిస్తారు.

అయితే, కంపోస్టబుల్ ప్లాస్టిక్‌తో చేసిన బ్యాగ్‌లకు ఈ మందం మార్గదర్శకాలు వర్తించవు. వీటి తయారీదారులు లేదా వాటిని ఉపయోగించే బ్రాండ్ యజమానులు వాటిని విక్రయించడానికి లేదా ఉపయోగించడానికి ముందు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ () నుండి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.

మరోవైపు పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహణకు బాధ్యత వహించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్లాస్టిక్ వ్యర్థాల విభజన, సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, సరైన విధంగా పారవేయడాన్ని స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని తెలిపింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్వహణ సవరణ నియమాలపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.