తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్‌, 12 రాష్ట్రాలు

ఇటీవల అఫ్గాన్‌ భూభాగాలను మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్న తాలిబన్‌ సేనలు తాజాగా రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ ను స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం ప్రకటించాయి. ముజాహిదీన్ నగరంలోని అమరవీరుల స్క్వేర్‌కు చేరుకున్నామని తాలిబాన్ ప్రతినిధి ట్వీట్ చేసారు. అలాగే గవర్నర్ కార్యాలయం, ఇతర భవనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. 

దీంతో దక్షిణ నగరం వెలుపల సైనిక కేంద్రంనుంచి ప్రభుత్వ బలగాలను  మూకుమ్మడిగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడో అదిపెద్ద నగరమైన గజ్నీ పట్టణాన్ని గురువారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా కందహార్ పట్టణాన్ని సైతం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

గత వారంలో అప్గాన్‌లోని 34ప్రావిన్షియల్ రాజధానుల్లో సుమారు 11 ప్రాంతాలు తాలిబన్లు వశం చేసుకున్నారు. ఇపుడిక ఈ జాబితాలో తాలిబన్ల బలమైన  స్థావరం  కాందహార్ 12 వ స్థానంలో నిలిచింది. భద్రత బలగాలు ఎక్కడా వారికి ఎదురు నిలవలేకపోతున్నాయి. పరిమితంగా ఉన్న అమెరికా సైన్యం అక్కడక్కడా వైమానిక దాడులు జరుపుతున్నప్పటికీ, అవేమీ తాలిబన్లను నిలువరించలేకపోతున్నాయి.

కాగా ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌ను దక్షిణ ప్రావిన్సులను కలిపే కీలక రహదారి ఘాజ్నీ గుండాపోతున్నది. తాజాగా ఈ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించడంతో దక్షిణ ప్రావిన్సులతో రాజధానికి సంబంధాలు తెగిపోయినట్టు అయింది. మరోవైపు, ఆఫ్ఘన్‌ సైన్యానికి భారత్‌ బహూకరించిన ఎంఐ-24 హెలికాఫ్టర్‌ను తాలిబన్లు నియంత్రణలోకి తీసుకున్నట్టు సమాచారం.

ఈనేపథ్యంలో ఆఫ్ఘన్‌ సర్కారు తాలిబన్లతో సంధి చేసుకోవడానికి ముందుకొచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సంధి ఒప్పందంపై తాలిబన్లు విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న తాలిబన్లను నిలువరించడంలో అక్కడి ప్రభుత్వం క్రమంగా ఓటమి అంచుల్లోకి వెళ్తున్నది. 

దీంతో అధికారం కోసం తాలిబన్లు సృష్టిస్తున్న హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కతార్‌లోని దోహాలో జరుగుతున్న సదస్సులో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ‘దేశంలో తాలిబన్లు ఘర్షణ వాతావరణానికి ముగింపు పలుకాలి. దీనికి ప్రతిగా దేశ బాధ్యతలను కొంతకాలంపాటు అప్పగిస్తాం. ఇది పవర్‌ షేరింగ్‌ డీల్‌ అనుకోవచ్చు’ అని ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి చెందిన అధికారి ఒకరు ప్రతిపాదనను తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే, మరికొద్ది రోజుల్లో సమస్త ఆఫ్ఘన్‌ భూభాగం తమ వశంకానున్న నేపథ్యంలో ‘పవర్‌ షేరింగ్‌ డీల్‌’కి సమ్మతించాల్సిన అవసరం తమకులేదని తాలిబన్ల అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.