టీకా రెండు డోసులు తీసుకున్నా కేరళలో40 వేల మందికి క‌రోనా!

భారత్ లోని మిగ‌తా రాష్ట్రాల్లో క‌రోనా  త‌గ్గుముఖం ప‌డుతున్నా  కేర‌ళ‌లో ఇప్ప‌టికీ భారీగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా 40 వేల మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన‌ట్లు వస్తున్న వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. 

కేంద్ర ఆరోగ్య‌శాఖ వ‌ర్గాలు ఈ విష‌యం వెల్ల‌డించిన‌ట్లు ఎన్డీటీవీ తెలిపింది. ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్ష‌న్‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కేంద్రం అలా కేసుల న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాల‌ని కేర‌ళ‌కు సూచించింది. 

వ్యాక్సిన్లు అందించే రోగ‌నిరోధ‌క శ‌క్తిని బోల్తా కొట్టించే విధంగా వైర‌స్ మ్యుటేట్ చెందితే అది నిజంగా ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే అవుతుంద‌ని ఆరోగ్య శాఖ వ‌ర్గాలు చెప్పాయి. ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్ష‌న్ల‌కు డెల్టా వేరియంటే కార‌ణ‌మా లేదా అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్టత రాలేదు.

వీటిలో చాలా వ‌ర‌కూ ఇన్ఫెక్ష‌న్లు కేర‌ళ‌లోని ప‌త‌నంతిట్టా జిల్లాలోనే న‌మోద‌య్యాయి. ఈ జిల్లాలో తొలి డోసు తీసుకున్న త‌ర్వాత 14,974 మంది క‌రోనా బారిన ప‌డ‌గా.. మ‌రో 5,042 మంది రెండో డోసు కూడా తీసుకున్న త‌ర్వాత క‌రోనా పాజిటివ్‌గా తేలారు.

అంతేకాదు కేర‌ళ‌లో చాలా అరుదుగా క‌నిపించే రీఇన్ఫెక్ష‌న్లు కూడా ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ వ‌ర్గాలు తెలిపాయి. కేర‌ళ‌లో కొన్ని వారాలుగా ప్ర‌తి రోజూ 20 వేల వ‌ర‌కూ కేసులు న‌మోదవుతున్నాయి.