కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా బ్లాక్

నిబంధ‌న‌లు ఉల్లంఘించామంటూ ట్విట‌ర్ త‌మ అధికారిక అకౌంట్‌ను బ్లాక్ చేసింద‌ని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌ల అకౌంట్ల‌ను ట్విట‌ర్ లాక్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వ ఒత్తిడి వ‌ల్లే ట్విట‌ర్ ఇలా చేస్తోంద‌ని కాంగ్రెస్ మండిప‌డుతోంది. కాంగ్రెస్ అధికారిక ట్విట‌ర్ హ్యాండిల్ అయిన INCIndiaను ప్ర‌స్తుతం చూడ‌గ‌లుగుతున్నా.. కొత్త ట్వీట్ల‌ను మాత్రం పోస్ట్ చేయ‌లేక‌పోతోంది.

ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఉన్న ఐదు వేల మంది తమ నాయకులు, కార్య‌క‌ర్త‌ల అకౌంట్ల‌ను ట్విట‌ర్ బ్లాక్ చేసిందని ఏఐసీసీ సోష‌ల్ మీడియా హెడ్ రోహ‌న్ గుప్తా ఆరోపించారు. ఇప్పటికే ఆ పార్టీ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఖాతాను లాక్‌ చేసింది. తాజాగా మరో ఐదుగురు నేతలకు చెందిన అకౌంట్లను నిలిపివేసిందని ఆ పార్టీ నేత ప్రణవ్‌ ఝా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ఇందులో పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అజయ్‌ మాకెన్‌, లోక్‌సభలో ఆ పార్టీ విప్‌ మాణిక్కం ఠాగూర్‌, అసోం ఇన్‌చార్జి, మాజీ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌, కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌ ఖాతాలు లాక్‌ అయ్యాయని పార్టీ సమాచార విభాగం ఇన్‌చార్జి తెలిపారు.

కాగా, కాంగ్రెస్ నేతల ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయడంపై వస్తున్న ఆరోపణలపై ట్విట్టర్ స్పందిస్తూ అందరికీ సమానంగా నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.  నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు ట్విటర్ తెలిపింది.

 ‘‘మా సేవలను వినియోగించుకునే ప్రతి ఒక్కరికీ నిబంధనలను వివేకవంతంగా, నిష్పాక్షికంగా అమలు చేస్తాం. మా నిబంధనలను ఉల్లంఘించే చిత్రాలను పోస్ట్ చేసిన వందలాది ట్వీట్లపై ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకున్నాం. మా విస్తృత విధానాలకు అనుగుణంగా ఈ విధంగా చర్యలు తీసుకోవడాన్ని ఇకపై కూడా కొనసాగిస్తాం” అని ట్విట్టర్ అధికార ప్రతినిధి తెలిపారు. 

 కొన్ని రకాల ప్రైవేటు సమాచారం ఇతర సమాచారం కన్నా ఎక్కువ రిస్క్‌ను కలిగియుండవచ్చు, వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, భద్రతలను పరిరక్షించడమే ఎల్లప్పుడూ తమ లక్ష్యం అని తెలిపారు. తాము ట్విటర్ నిబంధనలు, విధానాల ఆధారంగా సమీక్షించామని, అదేవిధంగా భారత దేశ చట్టాల ప్రకారం వ్యక్తమైన ఆందోళనలను కూడా పరిశీలించామని పేర్కొన్నారు. 

లైంగిక దాడి కేసులో ఆరోపిత బాధితురాలి (ఓ మైనర్ బాలిక) తల్లిదండ్రుల వివరాలను వెల్లడించినట్లు నిర్దిష్టంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) తమకు తెలియజేసిందని పేర్కొన్నారు. అందుకే కొన్ని ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు.