రాజ్యసభలో విపక్షాల ప్రవర్తనపై క్షమాపణ కోరిన మంత్రులు

విప‌క్షాల ఆంద‌ళ‌న నేప‌థ్యంలో వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు రెండు రోజులు ముందుగానే నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఏడుగురు కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడుతూ పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ముందుగా వాయిదా వేసిన ఘ‌ట‌న‌లో ప్ర‌తిప‌క్షాలు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని  డిమాండ్ చేశారు.
రాజ్య‌స‌భ‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. విధుల్లో ఉన్న సెక్యూర్టీ ద‌ళాల‌పై విప‌క్ష స‌భ్యులు దూసుకువెళ్లిన‌ట్లు ఆ వీడియోలో ఉన్న‌ది. దీనికి సంబంధించిన 2.50 నిమిషాల వీడీయోను బ‌య‌ట‌పెట్టారు. స‌భ‌లో నినాదాలు చేస్తున్న ఎంపీలు.. యూనిఫామ్‌లో ఉన్న మార్ష‌ల్స్ ఆ వీడియోలో క‌నిపించారు. చైర్ వైపు దూసుకువస్తున్న ఎంపీల‌ను మార్ష‌ల్స్ అడ్డుకున్నారు. ఇక ప్ర‌తిప‌క్ష ఎంపీలు పేప‌ర్ల‌ను చించేసి గాల్లోకి విసిరేసిన దృశ్యాలు కూడా ఆ సీసీటీవీలో క‌నిపిస్తున్నాయి. 
 
ఓ ఎంపీ టేబుల్ ఎక్కుతున్న దృశ్యాలు కూడా దాంట్లో ఉన్నాయి. ప్ర‌భుత్వం రెండు రోజుల ముందే పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసింద‌ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ఈ వీడియోను రిలీజ్ చేశారు.  పార్ల‌మెంట్ సెక్యూర్టీలో లేని వారిని కూడా తీసుకువ‌చ్చి త‌మ‌ల్ని అడ్డుకున్న‌ట్లు ఎంపీలు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ వీడియోను రిలీజ్ చేశారు.

పార్ల‌మెంట్‌లో త‌మ స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తాల‌ని ప్ర‌జ‌లు ఎదురు చూస్తార‌ని, కానీ విప‌క్షాలు అరాచ‌కాన్ని సృష్టించాయ‌ని, వాళ్లు ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోలేద‌ని, ప‌న్నుదారుడి సొమ్ము వృధా అయ్యింద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.  రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఖండిస్తున్నామ‌ని, మొస‌లి క‌న్నీళ్లు ఆపేసి, విప‌క్షాలు దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మంత్రి ఠాకూర్ డిమాండ్ చేశారు. బిల్లులు పాస‌వుతున్న తీరును విప‌క్షాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయ‌ని ధ్వజమెత్తారు. 

రాజ్య‌స‌భ‌లో బుధ‌వారం నాడు కొంద‌రు ఎంపీలు.. టేబుళ్లు ఎక్కార‌ని, వాళ్ల‌కు వాళ్లు గ‌ర్వంగా ఫీల‌వుతున్నార‌ని, ఏదో ఘ‌న‌కార్యం చేసిన‌ట్లు వాళ్లు భావిస్తున్నార‌ని, స‌భ‌లో జ‌రిగిన దాన్ని షూట్ కూడా చేశార‌ని మంత్రి ప్రహ్లాద్ పటేల్ దుయ్యబట్టారు. పార్ల‌మెంట్‌లో వీడియో షూటింగ్ కు అనుమ‌తి లేద‌ని ఆయన గుర్తు చేశారు.

 విప‌క్షాల ప్ర‌వ‌ర్త‌నా తీరు హేయంగా ఉన్న‌ట్లు మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. ఫ‌ర్నీచ‌ర్‌, డోర్ల‌ను ధ్వంసం చేశార‌ని, మంత్రుల చేతుల నుంచి పేప‌ర్లు లాగేశార‌ని, మార్ష‌ల్స్‌పై తిర‌గ‌బ‌డ్డార‌ని, డెస్క్‌లు, చైర్ల‌ను ధ్వంసం చేశార‌ని, ఇది అనుచిత ప్ర‌వ‌ర్త‌న అని, వాళ్ల చ‌ర్య‌లు సిగ్గుచేటుగా ఉన్న‌ట్లు గోయ‌ల్ తెలిపారు.