ఈసారి జనాభా లెక్కలకు ఓ ప్రత్యేకత రాబోతోంది. డిజిటలైజ్ అయ్యే తొలి జనాభా లెక్కలు కాబోతున్నాయి. దీనిలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం కూడా ఉంటుంది. ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు ఈ వివరాలను తెలిపింది. 2021 జనాభా లెక్కల సేకరణ గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుందా? ఏమైనా మార్పులు ఉంటాయా? ఏదైనా అదనపు సమాచారం అవసరమవుతుందా? అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం చెప్పింది. సమాచార సేకరణ కోసం మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు తెలిపింది. జన గణనకు సంబంధించిన వివిధ అంశాల నిర్వహణ, పర్యవేక్షణల కోసం సెన్సస్ పోర్టల్‌ను అభివృద్ధిపరచినట్లు పేర్కొంది.
ఈ పోర్టల్‌లో లాగిన్ అవాలంటే వ్యక్తుల మొబైల్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు అవసరమని తెలిపింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం వ్యక్తులు కొన్ని వివరాలను సమర్పించవలసి ఉంటుందని పేర్కొంది. దరఖాస్తులోని ఖాళీలలో ఈ వివరాలను నింపవలసి ఉంటుందని, ప్రతిదానికి సంబంధిత కోడ్ ఉంటుందని పేర్కొంది.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఐడెంటిఫికేషన్ నంబరును పంపుతామని పేర్కొంది. ఈ సమాచారాన్ని అధికారులు సమన్వయపరిచేందుకు ఈ ఐడెంటిఫికేషన్ నంబరును తెలియజేయాలని చెప్పింది.
ఈ సమాచారాన్ని జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్‌సీ) వంటి ఇతర డేటాబేస్‌లను తయారు చేయడానికి ఉపయోగించబోమని వివరించింది. జనాభా లెక్కల సేకరణ చట్టం, 1948 ప్రకారం సేకరిస్తున్న ఈ సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించేది లేదని పేర్కొంది. అయితే, కులాలవారీగా సమాచారాన్ని ఈ దశలో వెల్లడించే ప్రతిపాదన లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు