పెగాస‌స్ వ్యవహారంపై చర్చలలో హద్దులు దాటవద్దు

పెగాస‌స్ వ్యవహారంపై విచార‌ణ స‌మ‌యంలో స‌మాంత‌ర చ‌ర్చ‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొంటూ న్యాయ‌స్థానాలు జ‌రిపే విచార‌ణ‌ల‌పై విశ్వాసం, న‌మ్మ‌కం ఉండాల‌ని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ హితవు చెప్పారు. ఈ కేసులో ఎవ‌రూ త‌మ హ‌ద్దుల్ని దాట‌వ‌ద్దని వారిస్తూ ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌కాశం ఇస్తామ‌ని స్పష్టం చేశారు. 

కోర్టులో కేసు వాద‌న‌లు జ‌రుగుతుంటే, పిటిష‌న‌ర్లు సోష‌ల్ మీడియాలో స‌మాంత‌ర చ‌ర్చ‌లు చేప‌ట్ట‌డం దేనికి అని కోర్టు ప్ర‌శ్నించింది. మీరు ఏదైనా చెప్పాల‌నుకుంటే, కోర్టులో చెప్పండి అంటూ సీజే పేర్కొన్నారు. ఒక‌సారి మీరు కోర్టుకు వ‌స్తే, అప్పుడు కోర్టులో స‌మ‌గ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంద‌ని తెలిపారు.

సామాజిక మాధ్య‌మాల‌తో పాటు బ‌య‌ట జ‌రిగే చ‌ర్చ‌ల‌కు ప‌రిధి ఉండాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ పిటిష‌న్ల‌పై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్ , జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం విచార‌ణ జ‌రుపుతున్నది. కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెగాస‌స్‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ప‌లువురు సుప్రీంలో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే.
 
ఫైల్ చేసిన పిటిష‌న్ల‌న్నీ త‌మ‌కు అందాయ‌ని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ‌తా తెలిపారు. ప్ర‌భుత్వం నుంచి సూచ‌న‌లు రావాల్సి ఉన్నందున స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. దీంతో పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. 
ఇజ్రాయిల్ సాఫ్ట్‌వేర్ పెగాస‌స్‌తో రాజ‌కీయ‌వేత్త‌లు, కార్య‌క‌ర్త‌లు, జ‌ర్న‌లిస్టుల‌పై నిఘా పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఫోన్ ట్యాపైన‌ట్లు తెలిస్తే, క్రిమిన‌ల్ ఫిర్యాదు ఎందుకు ఇవ్వ‌లేద‌ని కూడా ఆయ‌న పిటిష‌న‌ర్ల‌ను గతంలో ప్రధాన న్యాయమూర్తి అడిగారు.