ఆఫ్ఘన్ లో భారతీయులను వచ్చేయమన్న కేంద్రం

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతుండటంతో భారతీయులను రప్పించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. బల్ఖ్ ప్రావిన్స్ రాజధాని నగరం మజారే షరీఫ్‌లోని భారత కాన్సులేట్ అధికారులు, సిబ్బందిని వెనుకకు పిలిపిస్తోంది. 

ఈ నగరంలో తాలిబన్ల హింసాత్మక చర్యలు తీవ్రమవడంతో ఈ చర్యలు చేపట్టింది. మజారే షరీఫ్, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులను, ఇండియన్ కాన్సులేట్ సిబ్బందిని న్యూఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఓ ప్రత్యేక భారత వాయుసేన విమానం బయల్దేరుతోందని ఇండియన్ కాన్సులేట్ ఓ ట్వీట్‌లో మంగళవారం తెలిపింది. 

మంగళవారం రాత్రి ఈ విమానం మజారే షరీఫ్ నుంచి బయల్దేరుతుందని పేర్కొంది. ఆఫ్ఘన్ దళాలు, తాలిబన్ ఉగ్రవాదుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గత నెలలో కాందహార్ నుంచి కూడా ఇదే విధంగా భారతీయులను ఖాళీ చేయించారు. 

50 మంది దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బందిని కాందహార్ ఇండియన్ కాన్సులేట్ నుంచి తరలించారు. భారత వాయు సేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తరలించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం దాదాపు 1,500 మంది భారతీయులు ఉన్నారు.