ఏపీ ప్రభుత్వ పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్‌జీటీ ఆగ్రహం

పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలా ఉల్లంఘించడం చిన్న విషయమా.. ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించింది.

అనుమతులు లేకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ప్రాజెక్టులు నిర్మించారని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌, స్థానికులు జమ్ముల చౌదరయ్య, మదిచర్ల సత్యనారాయణ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లతో పాటు పోలవరం మట్టి డంపింగ్‌పై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు వేసిన పిటిషన్లపై  ఎన్‌జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఏకే గోయల్‌, న్యాయ సభ్యులు జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, బ్రిజేష్‌ సేథీ, సభ్య నిపుణుడు నాగిన్‌ నందాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది.

వచ్చేనెల 30 లోపు ఎప్పుడైనా తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేసింది. విచారణలో భాగంగా తొలుత పురుషోత్తపట్నంపై పిటిషనర్ల తరఫు కె.శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తామని రాష్ట్రప్రభుత్వం చెబుతోందని.. ఇది తాత్కాలిక ప్రాజెక్టు అయినప్పుడు రైతుల భూములను శాశ్వతంగా ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తేల్చిన సంయుక్త కమిటీ రూ.2.4 కోట్ల పర్యావరణ పరిహారాన్ని వసూలు చేసి కాలుష్య నియంత్రణ మండలికి ప్రభుత్వం జమ చేయాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. భూము లు కోల్పోయి రైతులు జీవనోపాధి కోల్పోయారని, ఈ పరిహారాన్ని మరింత పెంచి.. వారికి పంచాలని విజ్ఞప్తిచేశారు.

ఈ సందర్భంగా సంయుక్త కమిటీ తీరును ధర్మాసనం తప్పుబట్టింది. ‘పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని మీరే తేల్చారు. మట్టి, రాళ్లు వంటి నిర్మాణ వ్యర్థాలను ఆ ప్రాంతంలోనే గుట్టలుగుట్టలుగా పడేసినట్లు మీ నివేదిక తెలియజేస్తోంది. ఏదో నామమాత్రంగా నివేదిక అందించినట్లుగా ఉంది. సరిగా అధ్యయనం చేయలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది.

పర్యావరణ పరిరక్షణ చట్టం రాష్ట్రంలో అమలవుతోందా? అని ప్రశ్నించింది. ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాగని నిలదీసింది. రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. మరో 101 మంది రైతులకు భూసేకరణ పరిహారం రాలేదని, హైకోర్టు ఆదేశాల ప్రకారం వారికి పరిహారం అందిస్తామని చెప్పారు.

రూ.2.4 కోట్ల పర్యావరణ పరిహారం చెల్లించడానికి తమకు అభ్యంతరం లేదని, అందుకు కొంత సమయం కావాలని చెప్పారు. ఇలాంటి చిన్న విషయాలపై తనకు అవగాహన లేదని ఒక సందర్భంలో ఆయన పేర్కొన్నారు. దీనిపై ట్రైబ్యునల్‌ తీవ్రంగా స్పందించింది. ‘పర్యావరణం అంటే చిన్న విషయమా..? ఉల్లంఘనలు జరిగాయని తేలిన తర్వాత సంబంధిత అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించింది.

పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో రూ.1.9 కోట్లు మాత్రమే పర్యావరణ పరిహారాన్ని సంయుక్త కమిటీ సిఫారసు చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఉల్లంఘనలు జరిగాయని తేల్చి కూడా  ఇంత నామమాత్రంగా సిఫారసు చేస్తారా? అని ప్రశ్నించింది. ‘పోలవరం విషయంలో పర్యావరణ చట్టాన్నే అమ లు చేయడం లేదు. ఇది సిగ్గుచేటు. ఎగువ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వీటి వల్ల జీవితకాలమంతా వారు కష్టపడింది వృథా అవుతుంది’ అని  ధర్మాసనం స్పష్టం చేసింది.

స్పందించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తరఫున న్యాయవాది.. ఇవన్నీ రాష్ట్రప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, అదే అధ్యయనం చేసి నష్టపరిహారం అందించాలని వ్యాఖ్యానించారు. స్పందించిన ధర్మాసనం ‘మీరు తనిఖీల కోసం అక్కడకు వెళ్లారు కదా..? మీరే ఎందుకు అధ్యయనం చేయలే దు ? మీరేం చర్యలు తీసుకున్నారు? బాధ్యత నుంచి ఎలా తప్పించుకుంటారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.