అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయినదని, రాష్ట్ర  ప్రభుత్వం భారీగా బడ్జెట్‌యేతర అప్పులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి కార్పొరేషన్‌లు, కంపెనీల పేరుతో రూ. 56,076 కోట్లు అప్పుగా తీసుకుందని కేంద్రం తెలిపింది. 

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో క్రమక్రమంగా దిగిపోతుందని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. అయితే బడ్జెట్‌యేతర అప్పులుగా చెప్పడం విశేషం. ఏపీకి సంబంధించిన అప్పలపై ఇటీవల కేంద్రం సీరియస్ అయ్యింది.

వివిధ బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో ఎక్కువగా ఎస్‌బీఐ నుంచి అత్యధికంగా రూ.15,000 కోట్లకుపైగా తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్లకు పైగా రుణం తీసుకుంది. 

అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 7వేల కోట్లు, యూబీఐ నుంచి  రూ. 6,800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 5,700 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 4వేల కోట్లకుపైగా ఏపీ అప్పు తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేస్తోందని, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని విపక్షాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. చివరికి ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఈ సమయంలోనే కేంద్రం తాజాగా చేసిన ప్రకటన విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చినట్టయింది.