అభ్య‌ర్థుల క్రిమిన‌ల్ రికార్డులు 48 గంటల్లో వెల్లడించాలి

దేశంలోని రాజకీయ పార్టీల‌కు అత్యున్న‌త న్యాయ‌స్థానం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఓ అభ్య‌ర్థిని ఎంపిక చేసి 48 గంట‌ల్లోపు ఆ అభ్య‌ర్థికి సంబంధించిన క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాలని స్ప‌ష్టం చేసింది. జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల‌తో కూడి ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 13న తాము ఇచ్చిన తీర్పులో మార్పులు చేసింది.

2020 ఫిబ్రవరి తీర్పులోని పేరా 4.4 లో అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటలలోపు లేదా నామినేషన్ల దాఖలుకు మొదటితేదీకి రెండు వారాల ముందు వారి నేరరికార్డులను ప్రకటించాలని సుప్రీం ఆదేశించింది.  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌తంలో ఇచ్చిన తీర్పు ప్ర‌కారం.. స‌ద‌రు అభ్య‌ర్థే త‌మ ఎంపిక పూర్త‌యిన 48 గంట‌ల్లోపు లేదంటే నామినేష‌న్ ప‌త్రాలు వేసే తొలి తేదీకి రెండు వారాల ముందు త‌మ‌పై ఉన్న క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాలి.

అయితే ఇప్పుడా ఆదేశాల‌కు మార్పులు చేస్తూ ఆయా పార్టీలే త‌మ అభ్య‌ర్థుల క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాల్సిందిగా సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టంచేసింది. 

త‌మ అభ్య‌ర్థుల క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టని పార్టీల గుర్తుల‌ను ర‌ద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. గ‌తంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇచ్చిన ఆదేశాల‌ను పాటించ‌ని పార్టీల‌పై కోర్టు ఉల్లంఘ‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ పిటిష‌న్ కోరింది.

ఇలా ఉండగా,  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు సుప్రీంకోర్టు జ‌రిమానా విధించింది. ఆ రెండు పార్టీల‌తో పాటు మొత్తం తొమ్మిది పార్టీల‌కు అత్యున్న‌త న్యాయ‌స్థానం జరిమానా విధించింది.  త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌పై ఉన్న నేర చ‌రిత్ర‌ను బ‌య‌ట‌పెట్ట‌ని కార‌ణంగా.. ఆ పార్టీల‌కు జరిమానా విధిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది. 

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల‌కు ల‌క్ష జ‌రిమానా విధించ‌గా, సీపీఎం, ఎన్సీపీలకు 5 ల‌క్ష‌ల ఫైన్ వేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఆ పార్టీలు త‌మ ఆదేశాలు పాటించ‌లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది.