విమానయాన రంగంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు

దేశీయ విమానయాన పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమానయాన రంగంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలకు సిద్ధమవుతున్న మోదీ ప్రభుత్వం  అక్కడ రూ. 25,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. వచ్చే 4,5 సంవత్సరాలలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ రంగంలో రూ. 25,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. 

దీంతో విమానాశ్రయంలో అత్యున్నత శ్రేణి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు హైటెక్‌గా మారనున్నాయి. అదేవిధంగా, దేశంలో 6 కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 21 కొత్త విమానాశ్రయాలను ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో తెలిపారు.

ఇప్పటివరకు ఆరు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. వీటిలో మహారాష్ట్రలోని షిర్డీ, సిక్కింలోని పాక్యాంగ్, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్, కేరళలోని కన్నూర్, కర్ణాటకలోని కలబురగి మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు ఉన్నాయి. 2007 లో ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనమైందని, అప్పటి నుంచి కంపెనీ నిరంతరం భారీ నష్టాలను చవిచూస్తున్నదని మంత్రి వీకే సింగ్ చెప్పారు. 2020 మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం నష్టం రూ.70,820 కోట్లకు పెరిగిందని తెలిపారు.

పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మార్గం ద్వారా ఇప్పటికే ఉన్న, కొత్త విమానాశ్రయాలలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2021 జూలై 27 నాటికి, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్- ఉడాన్‌ కింద 359 మార్గాలు పనిచేస్తున్నాయని, ఇవి భారతదేశంలో 59 వాటర్ ఎయిర్‌రోమ్‌లు, ఐదు హెలిపోర్ట్‌లతో సహా 59 సర్వ్‌డ్, అండర్‌సర్వ్‌డ్‌ ఎయిర్‌పోర్ట్‌లను కలుపుతాయని తెలిపారు  పేర్కొన్నారు. 

ఆధునిక వైడ్-బాడీ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. విస్తారా ఎయిర్‌లైన్స్ ఇప్పటివరకు రెండు కొత్త వైడ్-బాడీ విమానాలను కొనుగోలు చేసినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్‌ చెప్పారు.