విద్యుత్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఉచితం 

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన అడుగు వేసింది. బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్లకు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది. విద్యుత్  వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదా పునరుద్ధరించడానికి ఎటువంటి ఛార్జీలను వసూలు చేయరని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

విద్యుత్ వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ మార్కుల జారీకి కూడా ఎలాంటి రుసుం వసూలు చేయరని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల ఈ-స్కూటర్ లేదా బైక్ కొనుగోలు ఖర్చు కనీసం రూ.1,000 తగ్గుతుందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వింకేశ్ గులాటి చెప్పారు. విద్యుత్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్‌లు కూడా రూ.4,000 వరకు లబ్ధి పొందుతారు.

జూలై ఆరంభంలో ఫేమ్‌-2 పథకం కాలపరిమితిని రెండు సంవత్సరాల పాటు 2024 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. అంతకు ముందు ఈ పథకం 2022 ఏప్రిల్ నెలలో ముగుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలు తమ స్థాయిలలో విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయడం సులభతరం చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్రాలు కూడా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి పలు ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించాయి. గత నెలలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రోత్సాహక విధానాన్ని అమలు చేశాయి. ఈ విధానం ఇప్పటికే మూడు ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్నది.

దీంతో విద్యుత్  ద్విచక్ర వాహనాల ధర దాదాపు సగానికి సగం తగ్గింది. 20 రాష్ట్రాలు విద్యుత్  వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియలో విధానాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించిన రాష్ట్రాలలో వీటి ధరల్లో 40 శాతం వరకు భారీ తగ్గింపు ఉండనున్నది.