ఓబీసీ జాబితా తయారీకి రాష్ట్రలకు మళ్లీ అధికారం !

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తమ సొంత ఓబీసీ జాబితాను రూపొందించుకునే అధికారాన్ని తిరిగి కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బిల్లును కేంద్రం త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను (ఎస్‌ఈబీసీ) గుర్తించే రాష్ర్టాల అధికారాన్ని 102వ రాజ్యాంగ సవరణ హరించిందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని సమీక్షించాలంటూ కేంద్రం చేసిన అభ్యర్థననూ తోసిపుచ్చింది. వాస్తవానికి ఓబీసీ జాబితాను రూపొందించే అధికారం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండేది. అయితే 2018లో కేంద్ర ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌కు అధికారాలను కల్పించేందుకు చేపట్టిన 102వ రాజ్యాంగ సవరణతో ఈ అధికారం రాష్ట్రాల చేతుల్లో లేకుండా పోయింది.  

ఈ సవరణలో చేర్చిన 342ఏ అధికరణ ద్వారా ఏ కులాన్నైనా ఓబీసీ జాబితాలో చేర్చే అధికారం జాతీయ బీసీ కమిషన్‌కు సంక్రమించింది. దీన్ని ప్రతిపక్షాలు అప్పట్లో నే తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రాల అధికారాన్ని లాగేసుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం దెబ్బ తీస్తోందన్నాయి. అయితే రాష్ట్రాల అధికారా న్ని లాక్కునే ఉద్దేశమేదీ లేదని కేంద్రం పేర్కొంది.

కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలను ఓబీసీల్లో చేర్చే ప్రతిపాదన చేయగా సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పునిచ్చింది. 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ అధికారం కేంద్రం చేతిలోనే ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును సమీక్షించాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌నూ ఈ ఏడాది మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో కేంద్రం మళ్లీ రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓబీసీ జాబితాకు సంబంధించి రాష్ట్రాల అధికారాన్ని పరిరక్షించేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్రం గత నెలలో రాజ్యసభలో తెలిపింది.

కాగా,  ఓబీసీ జాబితా రూపొందించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడంతోనే సరిపోదని మహారాష్ట్ర మంత్రి అశోక్‌ చవాన్‌ అన్నారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాలన్న నిబంధనను కూడా ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. మరాఠాలకు ప్రత్యేక కోటా కల్పించాలన్న మహారాష్ట్ర ప్రతిపాదనను 50 శాతం పరిమితి కారణంగా సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.