హాకీలో మ‌నోళ్లు గోల్స్ చేస్తుంటే…. కొందరు సెల్ఫ్ గోల్

హాకీలో మ‌నోళ్లు గోల్స్ చేస్తుంటే అంద‌రూ సెల‌బ్రేట్ చేసుకున్నార‌ని, కానీ కొంద‌రు మాత్రం సెల్ప్ గోల్ చేసుకుంటున్నార‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. దేశ ప్ర‌గ‌తిని అడ్డుకునేందుకు పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్షాలు శ‌తవిధాల ప్ర‌యత్నిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. 
 
పెగాసస్ వ్యవహాంరపై చర్చ జరపాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను ప్రతిష్ఠంభింపజేస్తున్న నేపథ్యాన్ని మోదీ తప్పుపట్టారు. దేశ పురోభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తామేమీ ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడం లేదని స్పష్టం చేసారు.  అభివృద్ధికి గోడలు కట్టాలన్నదే విపక్షాల అభిమతమని, వారి చర్యలు దేశ వ్యతిరేక చర్యల లాగే ఉన్నాయని ధ్వజమెత్తారు. భారత్ వేగంగా ముందకు నడుస్తోందని వివరించారు.
 
పార్ల‌మెంట్‌ను అడ్డుకుంటున్న ప్ర‌తిప‌క్షాల తీరును ప్ర‌జ‌లు స‌హించ‌రని మోదీ హెచ్చరించారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా దేశం ముందుకు వెళ్తోంద‌ని భరోసా వ్యక్తం చేశారు. నెగ‌టివ్ ప్ర‌జ‌లు దేశ పురోగ‌తిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న పథకంతో  ప్ర‌యోజ‌నం పొందిన ల‌బ్ధిదారుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో మోదీ ఈ వాఖ్యలు చేశారు. పార్ల‌మెంట్‌ను ఎంత అడ్డుకున్నా.. స్వార్థ‌ప‌రుల రాజ‌కీయాల‌కు త‌లొగ్గేదిలేద‌ని తేల్చి చెప్పారు.
 
41 ఏండ్ల త‌ర్వాత భార‌త్ హాకీ టీమ్ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించింద‌ని భార‌త యువ‌త అనూహ్య విజ‌యాల‌తో ముందుకు సాగుతోంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఒక‌రి పురోగ‌తి కుటుంబ నేప‌థ్యంపై కాకుండా శ్ర‌మించే తత్వంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, అయోధ్య‌లో రామమందిర నిర్మాణానికి శంకుస్ధాప‌న వార్షికోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఆగ‌స్ట్ 5 భార‌త చ‌రిత్ర‌లో ఎన్న‌టికీ గుర్తుండిపోతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు
 సీఎం యోగిపై ప్రశంసలు 
 
 ప్రజలు తమని తాము సుసంపన్నం చేసుకునే విధంగా యుపిలో  పాలన సాగుతోందని అంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.  యూపీలోని డబుల్ ఇంజన్ రాష్ట్రాన్ని చూసే దృక్పథాన్నే మార్చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రం సమర్థవంతమైన రాష్ట్రంగా మారగలదన్న విశ్వాసాన్ని యోగి కొన్ని రోజులుగా పాదుకొల్పుతున్నారని కొనియాడారు. 
 
నేరస్థుల్లో భయానక వాతావరణాన్ని మొదటి సారిగా సృష్టించారని మోదీ కితాబునిచ్చారు. బంధుప్రీతి, అవినీతికి అలవాటుపడ్డ  వ్యవస్థను ఓ అర్థవంతమైన వ్యవస్థగా మార్చేశారని తెలిపారు. . యోగి పాలనలో నేరుగా ప్రజల అకౌంట్లలోకే డబ్బులు చేరే విధంగా చూస్తున్నారని చెప్పారు. 
 
యూపీ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు యూపీలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయని త్లెఇపారు. గతంలో యూపీ అంటే కేవలం రాజకీయం మాత్రమే గుర్తొచ్చేదని, ఇప్పుడు మాత్రం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు.