అమెరికాపై మరోసారి కరోనా ఉగ్రరూపం 

అమెరికాలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో సుమారు లక్షన్నర కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి అనంతరం  మళ్లీ ఆగస్టులో  భారీగా కేసులు నమోదవడం గమనార్హం. 

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక భాగం అమెరికా నుండే వస్తున్నట్లు ఇప్పటికే డబ్ల్యుటిఒ ప్రకటించింది. గతేడాది కూడా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదైన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌ రాష్ట్రాల్లో కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 1,49,788 మందికి కరోనా సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరింది. 668 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 6.14లక్షలకు చేరింది.

అమెరికాలో వ్యాక్సినేషన్‌ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియెంట్‌ వ్యాప్తి చెందడమే తాజాగా కరోనా వ్యాప్తి చెందడానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కేసుల పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించారు. 

గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 30లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని, అలాగే 18 ఏళ్లు పైబడిన 70 శాతం మందికి కనీసం ఒక్క డోసును అందించగలిగామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఒక్కడోసు కూడా పూర్తికాని సుమారు 9 కోట్లమందికి త్వరలోనే వ్యాక్సిన్‌ వేయించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

దేశంలో మళ్లీ కేసులు భారీగా వస్తుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ కరోనా నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. గతంలో కొవిడ్‌ తీవ్రత తగ్గడంతో మాస్క్‌ అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు తాజాగా మాస్క్‌లు, భౌతికదూరం నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

అంతేకాకుండా న్యూయార్క్‌ సిటీలో ఆగస్టు 16 నుండి రెస్టారెంట్లు, జిమ్‌లకు వెళ్లేవారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సిందేనని మేయర్‌ ప్రకటించారు.