భద్రతా మండలికి అధ్యక్ష వహించే మొదటి ప్రధానిగా మోదీ 

అంతర్జాతీయ వ్యవహారాలలో తనదైన ముద్రతో,  ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు పొందుతున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధింపబోతున్నారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) చరిత్రలో దాని సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న మొదటి భారత్ ప్రధానిగా చరిత్ర సృష్టింపనున్నారు. 

ఈ మండలికి ఆగస్టు నెలలో భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ సమయంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూఎన్ఎస్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూఎన్ఎస్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్న తొలి భారత  ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించబోతున్నారు. 

ఈ వివరాలను ఐక్యరాజ్య సమితిలో భారత దేశ మాజీ  రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఆదివారం మండలికి భారత్ అధ్యక్ష పదవి చేపట్టిన సందర్భంగా ట్విటర్ వేదికగా తెలిపారు. మోదీ ఆగస్టు 9న యూఎన్‌ఎస్‌సీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని అక్బరుద్దీన్ చెప్పారు.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్న తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ నిలవబోతున్నట్లు ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 2019లో మోదీ ఐక్య రాజ్య సమితిని సందర్శించినప్పటి ఫొటోను షేర్ చేశారు. వర్చువల్ విధానంలో జరిగే సమావేశంలో మోదీ ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

అక్బరుద్దీన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ముందు ఉండి నడిపించాలని నాయకుడు కోరుకుంటుండటాన్ని ఇది స్పష్టం చేస్తోందని చెప్పారు. మన విదేశాంగ విధానంలో భారత దేశం, దాని రాజకీయ నాయకత్వం శ్రద్ధ పెడుతున్న విషయం వెల్లవడుతోందని తెలిపారు. 

యూఎన్ఎస్‌సీ రొటేటింగ్ ప్రెసిడెన్సీ ఆగస్టు నెలకు భారత దేశానికి వచ్చింది. ఈ సందర్భంగా మారిటైమ్ సెక్యూరిటీ, పీస్ కీపింగ్, కౌంటర్ టెర్రరిజం సమస్యలపై భారత దేశం ఈ నెలలో ప్రధానంగా దృష్టి సారిస్తుంది. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా, భారత దేశ ఉన్నతాధికారుల నాయకత్వంలో అత్యున్నత స్థాయి సమావేశాలు ఈ నెలలో జరుగుతాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా వంటివారు ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇవ్వాల్సిందే

ఇలా ఉండగా, ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లిలో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇవ్వాల్సిందేనంటూ ఉజ్బెకిస్థాన్ మ‌రోసారి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. 

‘ఐక్య‌రాజ్య‌స‌మితిలోని పెద్ద దేశాల్లో భార‌త్ ఒక‌టి. ఆగ్నేయ ఆసియా దేశాల్లో భార‌త్ పెద్దన్న‌ పాత్ర పోషిస్తున్న‌ది. కాబ‌ట్టి భార‌త్‌కు ఐక్య‌రాజ్య‌స‌మితిలో ప‌ర్మినెంట్ మెంబ‌ర్‌షిప్ ఇవ్వ‌డం చాలా ముఖ్యం’ అని భార‌త్‌లో ఉజ్బెకిస్థాన్ రాయ‌బారి దిల్‌సోద్ అఖ‌టోవ్ పేర్కొన్నారు. 

భార‌త్ ఇవాళ‌ రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లి అధ్య‌క్ష‌త బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్భంగా అఖ‌టోవ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లిలో భార‌త శాశ్వ‌త స‌భ్య‌త్వ హోదాకు తాము ఎప్పటినుంచో మ‌ద్ద‌తు తెలుపుతున్నామ‌ని ఆయన స్పష్టం చేశారు.

ఐక్య‌రాజ్య‌స‌మితిలో శాశ్వ‌త స‌భ్య‌త్వ హోదా లేని దేశాల‌కు కూడా త‌మ మ‌ద్ద‌తు ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని అఖ‌టోవ్ తెలిపారు.  ఆఫ్ఘ‌నిస్థాన్ అభివృద్ధికి భార‌త్ కృషి చేస్తున్న‌ద‌ని, ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించ‌డంలో కూడా భార‌త్ కీల‌కపాత్ర పోషిస్తున్న‌ద‌ని ఉజ్బెకిస్థాన్ రాయ‌బారి అఖ‌టోవ్ కొనియాడారు.