రామప్పలో ఏడు అద్భుతాలు

తెలంగాణాకు చెందిన రామప్ప మందిరాన్ని విశ్వ వారసత్వ సంపదగా యునెస్కో ఇటీవల ప్రకటించింది. చైనా దేశపు ఫుజోవ్ నగరంలో జరిగిన విశ్వ వారసత్వ సమితి 44 వ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచవారసత్వం అంటే భూమి పైన ఉన్న సాటిలేని, అద్వితీయమైన సనాతన విలువలను మానవజాతి, భావితరం కోసం రక్షించవలసిన విషయాలు.

కాకతీయ కాలానికి చెందిన రామప్ప గౌరవప్రదమైన చరిత్ర క్రీ.శ.1234 లో నిర్మితమైంది. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న 800 సంవత్సరాల క్రిందటి ఈ పురాతన మందిరం దాని పరిసరాలు వాస్తుశాస్త్ర సహితంగా ఎన్నో సర్వోన్నతమమైన విషయాలతో కూడుకొనిఉంది. ఈ మందిరపు ఏడు విశిష్ఠ విషయాలను తెలుసుకొందాం.

1. మందిరం దానిని నిర్మించిన శిల్పి పేరును తెలుపుతుంది. ఈ మందిరం కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో నిర్మించారు. దీనిని నిర్మించిన శిల్పి పేరు రామప్ప సతపథి. ఇందువలన ఆ ప్రాంతాన్ని రామప్ప మందిర సమూహం అంటారు. దీనిలోని ప్రముఖ శివాలయాన్ని రుద్రేశ్వర మందిరం అంటారు. కాకతీయ సేనాపతి రేచర్ల రుద్రుడి నేతృత్వంలో నిర్మించడం వల్ల ఆ దేవునికి రుద్రేశ్వరుడని పేరు వచ్చింది. అంటే రాజుగారికి బదులుగా శిల్పి, సేనాపతులకు పేరు ప్రతిష్ఠలు వచ్చాయి.

2. ఈ ఆలయాన్ని నీటిపైన తేలే ఇటుకలతో కట్టారు. మందిర నిర్మాణానికి వాడిన ఇటుకలు చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి.పురావస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం ఈ మందిరంలో సాధారణ రాళ్ళకు బదులుగా సాంకేతిక నైపుణ్యంతో తక్కువ బరువు కలిగిన ఇసుకరాళ్ళలాంటి సామాగ్రిని, చాలా తేలికైన స్పాంజిలాంటి ఇటుకలను ఉపయోగించారు.అవి నీటిలో తేలుతాయి.ఈ విషయం ఆ కాలంలో భారతదేశంలో గల ఉన్నతమైన సాంకేతికతకు గీటురాయి.

3. చేతనత్వం కలిగిన నంది ఈ ఆలయంలో మరొక ఆకర్షణ. మండపంలో కూర్చున్న నంది శివలింగం వైపు ముఖంపెట్టి ఎలాంటి అరమరికలు లేకుండా నిరంతరం సచేతనంగా శివున్ని చూస్తున్న రీతిలో కూర్చుండి ఉంటుంది. కాని శివాలయాలలో అలాంటి ముద్రలో ఉన్న నందులు మనకు కనిపించవు. సచేతనమైన నందికి ఆభూషణాలతో అలంకరించిన విధానం ఎంత గొప్పగా ఉందంటే దాని హోష్ ను కూడా చిత్రకళలో చూపించారు. మరొక అద్భత విషయమేమిటంటే ఈ మందిరంలో తొమ్మిది అడుగుల ఎత్తైన శివలింగముంది.

4. దేవాలయపు గోడలపైన రామాయణం, శివపురాణం గాథలను చిత్రాలుగా మలిచారు. మందిరపు గర్భగుడిలో, గోడలపైన ఈ గొప్ప గ్రంథాలే కాకుండా ఇతర గ్రంథాలలోని ఎన్నో ప్రేరణాత్మకమైన దృశ్యాలను చెక్కారు. అంటే రాళ్ళపైన ఆ గ్రంథాలను సజీవంగా నిలిపారు. మందిరంలో నాట్యం, పౌరాణిక, జంతువుల ప్రతిమలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అవి ఆకర్షణీయంగా, సజీవంగా ఉన్నాయి.

5. చక్కని నగిషీలు, సుందరమైన స్తంభాలు, మందిరపు గోడలు, కప్పుపైననే కాకుండా ఆ స్తంభాలపైన చెక్కిన సుందరమైన శిల్పకళానైపుణ్యం, అందులో మలిచిన విగ్రహాలు, ప్రతిమలు కూడా చక్కని నిర్మాణశైలికి తార్కాణం. అక్కడ స్తంభాలపైన చేతితో కొట్టినపుడు సంగీతస్వరాలు వెలువడుతాయి.

6.దాదాపు 40 సంవత్సరాల నిరంతర కృషి వలన ఈ మందిరం నిర్మించినట్లు తెలంగాణా ప్రభుత్వపు వెబ్ సైట్ ద్వారా తెలుస్తుంది.

7. ఈ ఆలయనిర్మాణంలో భూకంపాలను కూడా తట్టుకొని నిలబడే సాంకేతికత ఉంది. 17 వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో చాలా పెద్ద భూకంపం వచ్చింది.ఆ భూకంపం వలన కొద్దిపాటి నష్టం జరిగినప్పటికి “ఇసుక పునాదుల “ సాంకేతికత కారణంగా ఆ మందిరపు ముఖ్యమైన చరిత్ర చెక్కుచెదరలేదు.

యునెస్కో జాబితాలో ఇది భారతదేశపు 39వ వారసత్వసంపద.ప్రపంచ వారసత్వజాబితాలో చేరడం గర్వించదగిన విషయం. కేవలం తెలంగాణాకే కాకుండా భారతదేశం మొత్తానికి పేరుప్రతిష్ఠలు తెచ్చే విషయమిది

హిందీ మూలం : జితేంద్ర దేవ్.
తెలుగుసేత : రత్న లక్ష్మీ నారాయణ రెడ్డి

సౌజన్యం :www.batangad.com