శశికళ అన్నాడీఎంకే కబళించే ప్రయత్నాలు ఫలించవు

మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ అన్నాడీఎంకే పార్టీని కబళించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, పార్టీపై ఓ కుటుంబ ఆధిపత్యాన్ని అనుమతించబోమని ఆ పార్టీ సమన్వయకర్త  మాజీముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంస్పష్టం చేశారు. శశికళను సర్వసభ్య మండలి పార్టీ నుంచి ఎప్పుడో బహిష్కరించిందని, పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధాలు లేదని తెగేసి చెప్పారు.

అన్నాడీఎంకే మునుపటి కంటే బాగా బలపడిందని, పార్టీ శ్రేణులంతా పార్టీ పట్ల విశ్వాసంతో అంకితభావంతో ఉంటున్నారని ఆయన తెలిపారు. డీఎంకే ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా తేని జిల్లా బోడినాయకనూర్‌లో బుధవారం ఉదయం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు పన్నీర్‌సెల్వం నాయకత్వం వహించారు. 

సుమారు వెయ్యిమందికి పైగా పార్టీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అమలుకు సాధ్యం కాని ఐదువందలకుపైగా హామీలతో డీఎంకే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. 

అధికారంలోకి వచ్చాక డీఎంకే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కీలకమైన హామీలను కూడా నెరవేర్చలేదని, ముఖ్యంగా నీట్‌ పరీక్షల రద్దు, గృహిణులకు ప్రతినెలా వెయ్యిరూపాయల ఆర్థికసాయం, పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గింపు వంటి హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. 

ఇటీవల ఎడప్పాడితో కలిసి తాను ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుసుకోవడంపై డీఎంకే నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందని కొట్టిపారవేసారు. తన కుమారుడికి మంత్రి పదవి అడిగేందుకు వెళ్లలేదని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించమని విజ్ఞప్తి చేయడానికే వెళ్ళామని పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు.

రాష్ట్రానికి సరిపడేంతగా కరోనా నిరోధక టీకాలు కేటాయించాలని, తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం జరుపుతున్న దాడులను అరికట్టాలని, మదురై ఎయిమ్స్‌ ఆసుపత్రిని త్వరగా నిర్మించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.

అన్నాడీఎంకే పార్టీలో తామిరువురమూ ఒకే మాట, ఒకే బాట అనే రీతిలోనే నడచుకుంటున్నామని తెలిపారు. తామిద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని తేల్చిచెప్పారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన ధర్నా పిలుపునకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన లభించిందని, రాష్ట్ర మంతటా పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారని ఆయన తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ ఎదుట హాజరయ్యేందుకు తాను సిద్ధంగా వున్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా పన్నీర్‌సెల్వం బదులిచ్చారు. గతంలో రెండుసార్లు తనకు సమన్లు జారీ అయినప్పుడు అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయానని, ప్రస్తుతం ఎప్పుడు పిలిచినా విచారణ కమిటీ ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.