హుజారాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వ వితరణపై ఈసీకి ఫిర్యాదు 

త్వరలో హుజారాబాద్ లో జరుగనున్న ఉపఎన్నికలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను వివిధ పధకాల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేయడంపై ఎన్నికల కమీషన్ కు మాజీ ఎమ్యెల్యే గొనె ప్రకాశరావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రూ 300  కోట్లు ఖర్చు చేసారని, మరో రూ 400 కోట్లు చేయబోతున్నారని అంటూ ఎన్నికల ప్రధాన కమీషనర్ కు వ్రాసిన లేఖలో ఆరోపించారు.
ఈ నియోజకవరంగలో ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఈ కార్యక్రమాలు అన్నింటిని కట్టడి చేయడంతో పాటు, వెంటనే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలులోకి తీసుకు రావాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్‌ పెడుతున్న ఖర్చుపై, ఆ పార్టీకి సన్నిహితంగా ఉన్న సాగునీటి కాంట్రాక్టర్లు, స్థిరాస్తి వ్యాపారులు, మౌలిక సదుపాయాల కంపెనీలపై నిఘా ఉంచాలని కూడా డిమాండ్ చేశారు. 
 
 టీఆర్‌ఎస్‌ ఇప్పటి నుండే అధికార దుర్వినియోగానికి పాలపడుతున్నదని, రాజకీయ ప్రత్యర్థులపై పొలిసు కేసులు బనాయిస్తూ భయానక పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అభ్యర్హ్ది ఈటెల రాజేందర్ తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులతో తిరుగుతున్న యువతను గుర్తించి, వారి ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. 
 
ఈటెల రాజేందర్ అధికార పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులను బదిలీ చేసి, తమకు అనుకూలమైన వారిని నియమించుకున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లను కూడా నమోదు చేశారని పేర్కొంటూ, ఓటర్ల జాబితాను కమీషన్ ప్రక్షాళన చేయాలని కోరారు. 
 
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా హుజారాబాద్ ఉపఎన్నిక మారబోతున్నదని అంటూ ప్రకాశరావు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై కూడా కమీషన్ నిఘా పెట్టాలని తన లేఖలో కోరారు.