క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై

క‌ర్ణాట‌క కొత్త ముఖ్యమంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై ఎన్నిక‌య్యారు. ఈ సాయంత్రం బెంగ‌ళూరులో జ‌రిగిన క‌ర్ణాట‌క‌ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయ‌నను త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు. 61 సంవత్సరాల బొమ్మై పార్టీలో అందరిని కలుపుకు పోగలరని, ఎన్నికల సమయంలో సమర్ధవంతమైన నాయకత్వం అందీయగలరనే నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తున్నది. 

ఈ స‌మావేశానికి క‌ర్ణాట‌క బీజేపీ ఎమ్మెల్యేల‌తోపాటు కేంద్ర ప‌రిశీల‌కులుగా మంత్రులు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, జీ కిష‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. బిజెపి ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ కూడా ఉన్నారు.  లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ బ‌స‌వ‌రాజు బొమ్మై క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు.

1998లో జ‌న‌తాద‌ల్ పార్టీలో చేర‌డంతో బ‌స‌వ‌రాజు బొమ్మై రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. ఆయ‌న 1998, 2004లో జ‌న‌తాద‌ల్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత 2008లో బీజేపీలో చేరారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న యెడియూర‌ప్ప మంత్రి వ‌ర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు.

ఈ రోజు జ‌రిగిన బీజేఎల్పీ స‌మావేశంలో స‌భా నాయ‌కుడిగా ఎన్నిక‌య్యారు. సోమ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన యెడియూర‌ప్ప ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన‌సాగుతున్నారు. తన వారసుడి పేరును  తాను సూచింపనని యడియూరప్ప స్పష్టం చేసినప్పటికీ ఆయన సూచన మేరకే బొమ్మయిని ఎన్నుకున్నట్లు తెలుస్తున్నది.

కర్ణాటకలో బిజెపికి బలమైన మద్దతుదారులుగా ఓటర్లలో సుమారు 17 శాతం మందిగా ఉన్న లింగాయత్ లు యడియూరప్ప రాజానామాతో పార్టీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఉండేందుకు ఆయనను ఎంపిక చేసిన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  మరో రెండేళ్లలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా పార్టీని ఎన్నికలలో విజయం  నడిపించగల అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సి వచ్చింది.