తాలిబాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమోతున్న తజికిస్తాన్‌!

ఆఫ్ఘనిస్తాన్‌లో నానాటికి పెట్రేగిపోతున్న తాలిబాన్‌ను ఎదుర్కొనేందుకు తజికిస్తాన్‌ సిద్ధమవుతున్నది. తమ సైనిక సామర్ధ్యాన్ని తాలిబాన్‌కు తెలియజెప్పేందుకు తజికిస్తాన్‌ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతున్నది. ఈ విన్యాసాల్లో భూ, వైమానికి, ఫిరంగి దళాలు పాల్గొన్నట్లు తెలుస్తున్నది. తాలిబాన్‌ నుంచి ఏరకమైన ఆపద ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.
 
తజికిస్తాన్‌ దేశాధ్యక్షుడు ఎమోమాలి రాఖ్మోన్‌ ఆదేశాల మేరకు దేశంలోని దాదాపు 2.30 లక్షల మంది ఆర్మీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఆఫ్ఘాన్‌ సరిహద్దులో 20 వేల మంది అదనపు సైనికులను మోహరించారు. సైనిక విన్యాసాలను ఆ దేశంలోని టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. 
 
‘సరిహద్దులోని ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్ధితులు చాలా క్లిష్టంగా, అస్థిరంగా మరాయి. దేశ సరిహద్దును రక్షించుకోవడానికి వీలుగా, సాధ్యమయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు సైన్యం సన్నద్ధంగా ఉండాలి’ అని ఎమోమాలి రాఖ్మోన్‌ సైన్యానాకి పిలుపునిచ్చారు.
 
మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌ ప్రావిన్స్‌లో 100 మందికిపైగా దారుణహత్యకు గురయ్యారు. దాడికి పాల్పడిన వారు స్పిన్‌ బోల్డాక్‌ జిల్లాలో వినాశనం సృష్టించినట్లు స్థానిక పత్రికలు తెలిపాయి. ఈ దారుణహత్యలకు ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం తాలిబాన్‌పై నిందలు వేసింది. అయితే, ఈ బాధ్యత తీసుకోవడానికి తాలిబాన్లు నిరాకరించారు. 
 
స్పిన్‌ బోల్డాక్‌ జిల్లాలో తాలిబాన్లు ప్రజల ఇండ్లను, ప్రభుత్వ కార్యాలయాలను కొల్లగొట్టినట్లు ఆఫ్ఘాన్‌ భద్రతా సంస్థలు తెలిపారు. ఇక్కడి పలు ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లచెదురుగా పడివున్నాయని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఇలాఉండగా, ఆఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అధ్యక్ష పదవి నుంచి దిగేంత వరకు ఆఫ్థాన్‌లో శాంతి నెలకొనదని తాలిబాన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ తెలిపారు.