వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ?

దిగవంత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హతపై  దర్యాప్తు జరుపుతున్న సిబిఐ కీలక  ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది.  వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తేలింది. ఇద్దరు ప్రముఖులు ఈ మొత్తన్ని అందజేసినట్లు సీబీఐ విచారణలో తేలింది.
ఈ కేసుకు సంబంధించి దాదాపు 47 రోజులుగా సీబీఐ బృందం కడప జిల్లాలో మకాం వేసి విచారణ జరుపుతోంది.  వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట  వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఆ వాంగ్మూలం కీలకంగా మారబోతోంది. సుపారీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని రంగయ్య చెప్పినట్లుగా తెలియవచ్చింది. 

ఆ ఐదుగురు బయట ప్రాంతానికి చెందినవారని, ఇద్దరు సుపారీ ఇచ్చారని, మరో వ్యక్తి మొత్తం 8 మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఈ వాంగ్మూలంతో సీబీఐ అధికారులు ముందుకువెళ్లే అవకాశం ఉంది.

రాష్ట్రంలో టిడిపి పాలన సమయంలో పులివెందులలో ఇంటిలోనే  మార్చ్ 14  2019 అర్ధరాత్రి  దారుణ హత్యకు వివేకానందరెడ్డి గురికాగా, దీనిని అధికార టిడిపి నాయకులే బాధ్యులని ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు జరుపుతున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని అంటూ, సిబిఐ తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. 

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తన బాబాయి హత్యా కేసు దర్యాప్తు పట్ల జగన్ చూపకపోవడం, సిబిఐ దర్యాప్తును వ్యతిరేకిస్తూ రావడం పలు  అనుమానాలకు దారితీసింది. వివేకా హత్య కేసు నిగ్గు తేల్చేందుకు నాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం వచ్చి మరో రెండు సిట్‌లు వేసింది. 

నెలలు గడిచినా దర్యాప్తులో పురోగతి లేకపోవడం, ఎవ్వరిని అరెస్ట్ చేయక పోవడంతో  దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని, సీబీఐకి అప్పగించాలని వివేకానందరెడ్డి  భార్య సౌభాగ్యమ్మ కుమార్తె  డా. సునీత  సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ  హైకోర్టును ఆశ్రయించింది. కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. 

గతేడాది మార్చి 11న ఈ కేసు దర్యాప్తు ను సీబీఐకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో 2020 జూలై 18న సీబీఐ రంగంలో దిగింది. అయితే కరోనా కారణంగా  సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం ఆలస్యమయింది.

దానితో డా సునీత అసహనంతో గత ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయంపై వెళ్లి సత్వరం దర్యాప్తు ప్రారంభించాలని కోరారు. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి, ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ ఏడాది జూన్‌ 6 నుంచి డీఐజీ సుధాసింగ్‌ నేతృత్వంలో సీబీఐ బృందం కడప సెంట్రల్‌ జైల్‌ గెస్ట్‌హౌస్‌లో రెండో విడత విచారణ చేపట్టింది. 

పలు దఫాలు దాదాపు 35-40 మందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వీరిలో వాచ్‌మన్‌ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందుల కు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌, ఈయన సోదరుడు సునీల్‌కుమార్‌యాదవ్‌, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్‌ వ్యాపారి గువ్వల గంగాధర్‌, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరులు ఉన్నారు. 

 హత్యకు గురైన వివేకా ఇంటిని, పరిసరాలను దర్యాప్తు బృందాలు పలుమార్లు పరిశీలించి., కీలక సమాచారం సేకరించాయని తెలుస్తున్నది.  ఈ సందర్భంగా అనుమానితులుగా సునీత 15 మంది పేర్లను సీబీఐకి ఇచ్చారు. ఆ జాబితాను ఆమె హైకోర్టుకు కూడా సమర్పించారు.  ఆ జాబితాలో జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు, వరుసకు సోదరుడైన కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి, హత్యకు గురైన వివేకానందరెడ్డి సోదరుడు వైఎస్ భాస్కరరెడ్డి పేర్లతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్లున్నాయి.  తన తండ్రిది `రాజకీయ హత్య’ అని డా. సునీత ఆరోపించారు.

అయితే ఆమె ఇచ్చిన జాబితాలోని వారిని ఇప్పటి వరకు సిబిఐ ప్రశ్నించనే లేదు. రాష్ట్ర పోలీసులు 9 నెలలపాటు దర్యాప్తు జరిపినా ఒక్క కీలక నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదని ఆమె సిబిఐ దృష్టికి తీసుకు వచ్చారు. కీలక సాక్షులలో ఒకరైన ఎస్ శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే మృతి చెందారని ఆమె తెలిపారు. దర్యాప్తు మరింత ఆలస్యమైతే మరింతమంది చనిపోయే ప్రమాదం ఉన్నదని ఆమె   ఆందోళన వ్యక్తం చేశారు.