హెచ్‌సీయూ వీసీగా జగదీశ్వర్‌ రావు

పన్నెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వైస్‌ చాన్సలర్ల(వీసీ) నియామకాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి వీసీగా డాక్టర్‌ బసుత్కర్‌ జగదీశ్వర్‌ రావు(బీజే రావు) నియమితులయ్యారు.  ప్రొఫెసర్‌ బీజే రావు స్వస్థలం మహబూబ్‌నగర్‌. 

వారి పూర్వీకులు మహారాష్ట్రకు చెందినవారు కాగా వందల ఏళ్ల కిందటే మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డారు. స్థానిక బండ్లగిరి ప్రాంతంలోని ప్రభుత్వ స్కూలు, కాలేజీల్లోనే ఆయన చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియా వర్సిటీలో ఎమ్మెస్సీ చదివారు. 

బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుంచి పీహెచ్‌డీ, అమెరికాలోని యేల్‌ మెడికల్‌ స్కూల్‌లో పోస్ట్‌ డాక్టొరల్‌ రీసెర్చ్‌ చేశారు. 1996 నుంచి 2018 వరకు ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ సంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2018 నుంచి తిరుపతిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సంస్థలో బయాలజీ సీనియర్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. బయాలజీకి సంబంధించిన అనేక జాతీయ, అంతర్జాతీయ జర్నళ్లలో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. 

ప్రొఫెసర్‌ బీజే రావు సతీమణి హేమవతి శాస్త్రవేత్తగా సేవలందించారు. కుమారుడు సంగీతంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నత విద్య ప్రారంభించి నగరంలోనే ఉన్న ప్రముఖ సంస్థకు వీసీగా రావడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్‌ సయీద్‌ ఐనుల్‌ హసన్‌ నియమితులయ్యారు. అయినుల్‌ హసన్‌ ప్రస్తుతం జేఎన్‌యూలో పర్షియన్‌ అండ్‌ సెంట్రల్‌ ఏషియన్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. 

 కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీగా ఉస్మానియా పూర్వాచార్యుడు బట్టు సత్యనారాయణ నియమితులయ్యారు. కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌కు చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 25 ఏళ్లపాటు వివిధ హోదాల్లో ప్రొఫెసర్‌ సత్యనారాయణ పనిచేశారు. రసాయన శాస్త్రానికి సంబంధించి ఆయన రాసిన 31 పరిశోధన పత్రాలు వివిధ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. విశ్వవిద్యాలయం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా 15 ,ఏళ్లపాటు పనిచేశారు. చదువుకునే రోజుల్లో ఎబివిపి ఆర్ట్ కాలేజి అధ్యక్షులుగా పనిచేశారు.