ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ పరేడ్ లో పాల్గొన్న భారత్ అథ్లెట్లు

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఒలింపిక్స్‌ క్రీడలు జపాన్‌ రాజధాని టోక్యోలో ఎట్టకేలకు ప్రారంభయ్యాయి. ఈ ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవాలు భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మొదలయ్యాయి. ఒలింపిక్స్‌ క్రీడలను జపాన్‌ చక్రవర్తి నరహిటో ప్రారంభించారు. 

కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం 1000 అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందానికి పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, ఆరుసార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ అయినమహిళా దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు.

ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు జపాన్‌ పతాకం స్టేడియంలోకి ప్రవేశించింది. చారిత్రక నేపథ్యం కలిగిన గ్రీస్‌ బృందంతో పరేడ్‌ మొదలైంది. ఐఒసి శరణార్థి ఒలింపిక్‌ జట్టును స్టేడియంలోకి ఆహ్వానించారు. ఈ జట్టుకు ఆహ్వానం పలకడం ఒలింపిక్‌ చరిత్రలో ఇది రెండోసారి. 1972 మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా పాలస్తీనియన్‌ గన్‌మెన్‌ చేతిలో హత్యకు గురైన ఇజ్రాయెల్‌ ఒలింపిక్‌ జట్టును ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మౌనం పాటించారు. ఇజ్రాయెల్‌ జట్టును స్మరించుకోవడం ఒలింపిక్స్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాల్లో ప్రారంభోత్సవ ప్రసారాన్ని వీక్షిస్తున్నారు. 203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11 వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నారు.

భారత్‌ నుంచి 124 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో 69 మంది ఫురుషులు, 55 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. టోక్యో ఒలింపిక్ వేడుక ప్రారంభం సాధారణ ఒలింపిక్ క్రీడలకు భిన్నంగా ఉంది. దాదాపు ఖాళీ స్టేడియంలో, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు మొదటి నివాళి అర్పించారు.

న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం

లింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌ హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన 3-2 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలి క్వార్టర్ చివరి వరకు 1-0తో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ డిఫెన్స్‌ను బ్రేక్ చేసి భారత ఆటగాళ్లు తొలి క్వార్టర్ చివరన గోల్ ని సాధించి స్కోర్‌ను 1-1తో సమం చేసారు. 
 
ఇక రెండవ క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ ప్రీత్ కొట్టిన గోల్ తో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మూడవ క్వార్టర్ లో భారత్ మరొక గోల్ తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.