ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌పై ఐటీ సోదాలు

అత్యంత కీల‌క‌మైన రెండు మీడియా సంస్థ‌ల‌పై  ఆదాయపన్ను శాఖ సోదాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ఖ్యాత హిందీ దిన‌ప‌త్రిక దైనిక్ భాస్క‌ర్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛానెల్ భార‌త్ స‌మాచార్‌పై ఐటీ సోదాలు చేప‌ట్టింది. దైనిక్ భాస్క‌ర్ ప‌త్రిక‌కు చెందిన 35 లొకేష‌న్ల‌లో సోదాలు జరుగుతున్నాయి.

100 మందికి పైగా ఆదాయపన్ను అధికారులు 30కు పైగా దైనిక్ భాస్కర్ కార్యాలయాలలో, కార్యనిర్వాహకుల గృహాలలో దాడులు జరుపుతున్నారు.  ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల్లోని దైనిక్ భాస్క‌ర్ కార్యాల‌యాల్లో ఐటీ సోదాలు కొన‌సాగుతున్నాయి. ఇక భార‌త్ స‌మాచార్ టెలివిజ‌న్‌కు సంబంధించి ల‌క్నోలోని ఆ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

అదేవిధంగా భార‌త్ స‌మాచార్ ఛానెల్ ఎడిట‌ర్ నివాసంలో కూడా ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆ రెండు మీడియా సంస్థ‌లు ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ‌వేసిన‌ట్లు క‌చ్చిత‌మైన సాక్ష్యాలు ఉన్నందువ‌ల్లే సోదాలు నిర్వ‌హిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు.

దాంతో ఆ రెండు ప‌త్రిక‌లు ప‌న్ను ఎగ‌వేసిన‌ట్లు గుర్తించిన ప్ర‌భుత్వం ఇప్పుడు సోదాలు చేయిస్తున్న‌ది. దేశంలో ఉన్న దిన ప‌త్రిక‌ల్లో దైనిక్ భాస్క‌ర్ గ్రూపు చాలా పెద్ద‌ది. కోవిడ్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో.. చాలా దూకుడుగా ఈ ప‌త్రిక రిపోర్టింగ్ చేసింది. మ‌హమ్మారి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఇచ్చిన నివేదిక‌ల‌ను త‌ప్పుప‌డుతూ లోతైన క‌థ‌నాల‌ను రాసింది.