సర్వర్లు మొరాయించడంతో ఏపీలో రేషన్ కు ఆటకంకం 

ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన పథకంలో భాగంగా రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇచ్చేందుకు సర్వర్లు మొరాయిస్తున్నాయి. జులై నుంచి నవంబరు వరకు ఈ పథకాన్ని కేంద్రం అమలు చేయనుండగా  జులై కోటాను పౌరసరఫరాల శాఖ మంగళవారం ప్రారంభించింది. 15 నుంచే ఉచిత రేషన్‌ పంపిణీ కొనసాగాల్సి ఉండగా, సర్వర్లను హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మార్చే ప్రక్రియలో జాప్యం నెలకొంది. 

దీంతో అవి ఆలస్యంగా అందుబాటులోకి రావడంతో రేషన్‌ పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభం కావాల్సి ఉండగా, సర్వర్లు పనిచేయక, సిగల్స్‌ అందక ఇాపోస్‌ మెషిన్లు పనిచేయలేదు. రేషన్‌ తీసుకునేందుకు పది రోజులే గడువు ఉండడంతో లబ్ధిదారులు పనులు మానుకుని రేషన్‌ షాపులకు క్యూ కట్టారు. 

ఖరీఫ్‌ సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న క్రమంలో కూలి మానుకుని రేషన్‌ షాపుల వద్ద రోజుల తరబడి నిలబడాల్సిన పరిస్థితి రావడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో జూన్‌ వరకు రేషన్‌ పంపిణీ వాహనదారులు (ఎండియు) రెండు విడతల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయడంతో డీలర్లతో అవసరం రాలేదు. 

కానీ ఎండియులు రెండు విడతల రేషన్‌ పంపిణీ తమవల్ల కాదని మొండికేయడంతో తప్పని పరిస్థితుల్లో రేషన్‌ డీలర్లు రెండో విడత రేషన్‌ను పంపిణీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇాపోస్‌ మెషిన్లు పనిచేయకపోవడంతో డీలర్లు ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. 

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెయ్యి కార్డులున్న ఓ రేషన్‌ షాపులో కేవలం 5 కార్డులకు మాత్రమే రేషన్‌ ఇవ్వడం సాధ్యపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,782 రేషన్‌ షాపుల్లోనూ ఇదేపరిస్థితి నెలకొంది. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సర్వర్‌ సమస్యను పరిష్కరించాలని ప్రజలు, డీలర్లు కోరుకుంటున్నారు.