సహకార సంఘాలపై రాజ్యాంగ సవరణ సక్రమమే

సహకార సంఘాల సమర్థ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చేసిన 97వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం మెజారిటీ తీర్పుతో సమర్థించింది. సహకార సంఘాలకు సంబంధించిన రాజ్యాంగంలోని 9బి భాగాన్ని తాము కొట్టివేస్తున్నామని, అయితే సవరణను మాత్రం కాపాడుతున్నామని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, కెఎం జోసెఫ్, బిఆర్ గవాయ్‌లతో కూడిన బెంచ్ తన తీర్పులో పేర్కొంది. 

న్యాయమూర్తి జోసెఫ్ పాక్షికంగా డిసెంట్ తీర్పు ఇచ్చారని, మొత్తం 97వ రాజ్యాంగ సవరణను కొట్టి వేశారని తీర్పు ప్రకటించిన జస్టిస్ నారిమన్ తెలిపారు. దేశంలో సహకార సంఘాల సమర్థ నిర్వహణకు సంబంధించిన అంశాలకు సంబంధించిన 97వ రాజ్యాంగ సవరణను పార్లమెంటు 2011 డిసెంబర్‌లో ఆమోదించగా, 2012 ఫిబ్రవరి 15నుంచి అమలులోకి వచ్చింది.

సహకార సంఘాలకు రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చిన ఈ మార్పు రాజ్యాంగంలోని 19(1)(సి)ని సవరించడంతో పాటుగా కొత్తగా 43 బి, పార్ట్ 9 బిని చేర్చింది. 

కొన్ని పరిమితులకు లోబడి అసోసియేషన్, లేదా యూనియన్, లేదా సహకార సంఘాలను ఏర్పాటు చేసే స్వేచ్ఛను రాజ్యాంగంలోని 19(1)(సి) కలిస్తుండగా, సహకార సంఘాలు స్వచ్ఛందంగా ఏర్పాటును ప్రోత్సహించడం, స్వతంత్రంగా పని చేయడం, ప్రజాస్వామిక కంట్రోల్ ఉండడం, వృత్తిపరమైన మేనేజిమెంట్ ఉండేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది ఆర్టికల్ 43బి చెప్తుంది. 

కాగా సహకార సంఘాల ఏర్పాటు, బోర్డు సభ్యులు, సహకార సంఘాల కార్యనిర్వాహక సభ్యుల నియమ నిబంధనలకు సంబంధించిన విషయాలు రాజ్యాంగంలోని 97వ అధికరణంలో చేర్చిన రాజ్యాంగంలోని పార్ట్ 9బిలో ఉంటాయి.

కాగా ఈ నిబంధన సహకార సంఘాల సంబంధించి చట్టాలను రూపొందించడానికి రాష్ట్రాలకున్న అధికారాలను హరించదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ రాజ్యాంగ సవరణలోని కొన్ని అంశాలను కొట్టివేస్తూ గుజరాత్ హైకోర్టు 2013లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.