టిటిడి చైర్మన్‌గా మరోసారి వైవి సుబ్బారెడ్డి

ఎపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నామినేటెడ్‌ పదవులను శనివారం ప్రకటించారు. ఈ క్రమంలోనే టిటిడి చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డిని మరోసారి నియమించారు. నామినేటెడ్‌ పదవుల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. 
 
ఆయన ఈ పదవిని పదవి కోరుకోవడం లేదని,క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ ఇటీవల వెల్లడించారు. గత నెల 21న రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఆయన ఎమ్యెల్సీగా నామినేట్ అయి రాష్ట్ర మంత్రివర్గంలో చేరాలని అభీష్టాన్ని వెల్లడించారు. లేదా వచ్చే ఏడాది మొదట్లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని అనుకొన్నారు. 
 
అయితే ముఖ్యమంత్రి మాత్రం ప్రస్తుతానికి ఇదే పదవిలో కొనసాగమని ఒప్పించినట్లు తెలుస్తున్నది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొనే మరో సమీప బంధువైన, ఒంగోలు కు చెందిన మంత్రి బి శ్రీనివాసరెడ్డికి ఉద్వాసన చెప్పవలసి వస్తుందని, ఆయనను రాజ్యసభకు పంపితే ఢిల్లీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోతుందని జగన్ ఇరకాటంలో పడినట్లు చెబుతున్నారు. 
 
మరోవైపు ఎపి నామినేటెడ్‌ పదవుల్లో ఎమ్మెల్యేలకు ఎవరికీ కూడా కార్పొరేషన్‌, చైర్మన్‌ పదవులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఎంఎల్‌ఎ లకు నిరాశ తప్పలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి రెండో ప్రాధాన్యత కింద అవకాశం ఇచ్చారు.
 
నామినేటెడ్‌ పోస్టుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 12 మందికి అవకాశం కల్పించారు. తరువాత సిఎం జగన్‌ సొంత జిల్లాలో 11 మందికి.. కాబోయే రాజధాని విశాఖలో 10 మందికి అవకాశాన్ని కల్పిస్తూ సిఎం జగన్‌ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొత్తం 135 పోస్టులకు గాను.. 56 శాతం వెనుకబడిన వర్గాలకు.. 50 శాతం మహిళలకు అవకాశం ఇచ్చారు.
 
ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి, వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌గా ఖాదర్ బాషా, శాప్ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్ధ్‌రెడ్డి, శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బి. బీరేంద్రవర్మ, ణిపాకం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా జ్ఞానేంద్రరెడ్డి, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు, క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌, రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి లను నియమించారు.
ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి, ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నార్తు రామారావు, సీడ్‌యాప్‌ ఛైర్మన్‌గా సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి, ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌, ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు లను నియమించారు.
నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు, ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌, కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా బర్రి లీల, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పేర్నాటి సుస్మిత నీయమితులయ్యారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పొనాక దేవసేన, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మేరుగ మురళీధర్‌, రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ ఛైర్మన్‌గా పొట్టెల శిరీష యాదవ్‌, ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ ఛైర్మన్‌గా షేక్‌ సైదాని, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నవీన్‌ నిశ్చల్‌, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నదీం అహ్మద్‌, నాటక అకాడమీ ఛైర్మన్‌గా యెట్టి హరిత లను నియమించారు.