`సుప్రీం ‘ పరిశీలనలో కరోనా నియంత్రణలో కోర్టుల పరిధి

కరోనా నియంత్రణపై కార్యనిర్వాహక వర్గం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోగలవా?, చేసుకుంటే ఎంతవరకు అనేది పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో వైద్య వ్యవస్థ అంతా ‘దేవుడి దయ’ అన్నట్టుగా ఉందని అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తున్నది.
 
ఈ విషయంలో అలహాబాద్‌ హైకోర్టు జోక్యం చేసుకోవడం అవసరమా, ‘దేవుడి దయ’ వ్యాఖ్యలు సబబేనా కాదా పరిశీలిస్తామని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. వ్యాక్సిన్‌ ఫార్ములాను తీసుకుని, వ్యాక్సిన్‌ను తయారుచేయమని స్థానిక కంపెనీలను ఎలా ఆదేశిస్తారు? అని జస్టిస్‌ శరణ్‌ ప్రశ్నించారు.
 
కార్యానిర్వాహక వర్గం పరిధిలోకి వచ్చే అంశాలు ఉంటాయని, అదీ సంక్షోభం వేళ ప్రతిఒక్కరూ ఆచితూచి వ్యవహరించాలని, ఎవరే పనిచేయాలనేది గమనించాలని జస్టిస్‌ మహేశ్వరి వ్యాఖ్యానించారు.
 
మరోవంక, కరోనా పట్ల ప్రజలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కొవిడ్‌ నిబంధనలంటే పట్టింపే లేకుండా తిరుగుతున్నారని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని అమలు చేయాల్సిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. 
 
ఈ మేరకు కేంద్రం హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ప్రజా రవాణా, మార్కెట్లలో, హిల్‌ స్టేషన్ల వద్ద ప్రజలు భారీగా గుమికూడుతున్నారని, కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలలో కేసులు మళ్లీ పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. 
కాగా, ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాంవడ్ యాత్రను రద్దు చేస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గురువారం ప్రకటించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, అందుకు తగ్గట్టుగానే నడుచుకుంటామని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో కాంవడ్ యాత్రను నిలిపేస్తున్నామని సీఎం పుష్కర్ సింగ్ ప్రకటించారు.