మెడిక‌ల్ హ‌బ్‌గా మారిన‌ కాశీ క్షేత్రం

పూర్వాంచ‌ల్‌లో కాశీ క్షేత్రం మెడిక‌ల్ హ‌బ్‌గా మారిన‌ట్లు  ప్ర‌ధాని నరేంద్ర మోదీ   తెలిపారు. ఒక‌ప్పుడు కాశీ ప్ర‌జ‌లు చికిత్స కోసం ఢిల్లీ లేదా ముంబై వెళ్లేవార‌ని, కానీ ఇప్పుడు ఇక్క‌డే అన్ని సౌక‌ర్యాలు ఉన్న‌ట్లు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో అనేక ప్రైవేట్, ప్రభుత్వ వైద్య సదుపాయాలు వస్తుండగా, ఇప్పటికే ఉన్న సదుపాయాలను మరింతగా మెరుగుపరుస్తున్నట్లు వివరించారు.
 
ఈ రోజు తన పర్యటన సందర్భంగా చేబడుతున్న రూ 1,583 కోట్ల వ్యయం కాగల వివిధ అభివృద్ధి పధకాలు కేవలం వారణాసి ప్రాంతంలోనే  కాకుండా, మొత్తం పూర్వాంచల్ ప్రాంత ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి తోడ్పడగలవని ప్రధాని చెప్పారు. విశ్వవిద్యాలయం ఆవరణలో 100 పడకలమాదిరి మాతా, శిశు వైద్యశాలను ప్రధాని ప్రారంభించారు. 
 
కరోనా కారణంగా చాల కాలం తర్వాత తన నియోజకవర్గ ప్రజలను నేరుగా కలుసుకొని అవకాశం తనకు కలిగినదని చెబుతూ కాశి విశ్వేశ్వరుడు, కాశి అన్నపూర్ణ మాతలకు ఆయన పాదాభివందనాలు తెలిపారు. మొత్తం ఉత్తర్ ప్రదేశ్ లో 550 ఆక్సిజన్ ప్లాంట్ లు రానున్నట్లు ప్రధాని వెల్లడించారు. 
 
ఉదయం వారణాసి విమానాశ్రయంకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ప్రధానికన్నా ముందు ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ గత ఏడేళ్లలో వారణాసిలో రూ 10,300 కోట్ల వ్యయం కాగల వివిధ పధకాల అమలు పూర్తి కాగా, మరో రూ 10,200 కోట్ల వ్యయం కాగల పధకాలు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. 
 
క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన పోరాటాన్ని ప్ర‌ధాని మెచ్చుకున్నారు. అత్య‌ధిక సంఖ్య‌లో యూపీలో వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నార‌ని, ఇక్క‌డే అత్య‌ధిక సంఖ్య‌లో వ్యాక్సిన్లు ఇస్తున్నార‌ని మోదీ ప్రశంసించారు. 
 
విప‌త్క‌ర స‌మ‌యాల్లో ఆగిపోమ‌ని, అల‌సిపోమ‌ని కాశీ ప‌ట్ట‌ణం నిరూపించింద‌ని ప్రధాని పేర్కొన్నారు. గ‌త కొన్ని నెల‌ల నుంచి యావ‌త్ మాన‌వాళి ఇబ్బందులు ఎదుర్కుంటోంద‌ని, కాశీతో పాటు యూపీ రాష్ట్ర‌మంతా ప్ర‌మాద‌క‌ర వైర‌స్ మ్యుటేష‌న్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.
 
కాశీలో సుమారు 700 సీసీటీవీ కెమెరాల‌ను ఇన్‌స్టాల్ చేయ‌నున్నారు. ఘాట్ల స‌మాచారం కోసం ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని వ‌ల్ల టూరిజం పెరుగుతుంద‌ని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. డీజిల్ బోట్ల‌ను సీఎన్జీగా మార్చుతున్నామ‌ని చెప్పారు. వ్య‌వ‌సాయ మౌళిక‌సదుపాయాల‌ను బోల‌పేతం చేస్తున్నామ‌ని, దీంతో జాతీయ మండీ వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు.
 
ప్రధాని తన పర్యటన సందర్భంగా జపాన్ సాంకేతిక సహకారంతో నిర్మించిన అత్యాధునిక సమావేశ కేంద్రం రుద్రాక్షను ప్రారంభిస్తున్నారు. ఇక్కడ 108 రుద్రాక్షలను ఏర్పాటు చేయగా, మొత్తం భవనం శివలింగ రూపంలో ఉంది. ఆ పరిసరం అంతా లెడ్ దీపాలతో అందంగా అలంకరించారు.