తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితి కొనసాగుతుండడం, బలగాల ఉపసంహరణ విషయంలో చైనా సానుకూల చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలతలు నెలకొన్నాయని భారత్ చైనాకు స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేషన్ కార్పొరేషన్(ఎస్‌సీఓ) సదస్సు సందర్బంగా బుధవారం దుషాంబెలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ల మధ్య ప్రత్యేకంగా సమావేశం జరిగింది.
వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ అంగీకరించబోదని ఈ సందర్భంగా జై శంకర్ వాంగ్ యికి స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొన్న తరువాతనే ఇరుదేశాల మధ్య సానుకూల సంబంధాలు సాధ్యమవుతాయని తేల్చి చెప్పారు. రెండు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో తదుపరి దశ చర్చలు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఫిబ్రవరిలో ఇరుదేశాల బలగాలు వెనక్కు వెళ్లిన తరువాత.. ఇతర వివాదాస్పద ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించే ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించడంతో ఇరుదేశాల సంబంధాలు దిగజారిన విషయాన్ని జైశంకర్ ప్రస్తావించారు.
‘తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొని ఉన్న మిగతా అన్ని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉంది’ అని జై శంకర్ స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడం, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని ఆపేయడం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) తప్పనిసరిగా చేయాలని జై శంకర్ స్పష్టం చేశారు. రష్యా, పాకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి బుధవారం ఆయన ఎనిమిది సభ్య దేశాలు ఉన్న ఎస్‌సీఓ కీలక సదస్సులో పాల్గొన్నారు
మరోవంక, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి చేయి దాటకమునుపే తాలిబన్‌లతో చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి జామిర్ కబూలోవ్ అఫ్గాన్ ప్రభుత్వానికి తాజాగా సూచించారు. చర్చల విషయంలో ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించట్లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. చర్చలు జరుపుతామంటూ అఫ్గాన్ ప్రభుత్వం పలు మార్లు ప్రకటించినా..ఇప్పటివరకూ అది కార్యరూపం దాల్చలేదని ఆయన పేర్కొన్నారు.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు