కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 11 శాతం పెంపు

ఓ వైపు కరోనా, ద్రవ్యోల్బణం పెరగడం… ఇంతటి క్లిష్ట సమయంలో మోదీ సారథ్యంలోని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురును అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే ఏకంగా 11 శాతం డీఏను కేంద్రం పెంచింది.
 
 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటి వరకూ మూడు విడతల డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందనేలేదు. కరోనా సంక్షోభ సమయంలో డీఏ పెంపుదలను కేంద్రం నిలిపేసింది. తాజాగా డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో  54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సెప్టెంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెరిగిన డీఏతో కలిసి జీతాలు తీసుకోనున్నారు.
 
ఏడో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార‌సుల మేర‌కు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్ల‌డించారు. ఈ పెంచిన డీఏ 2021, జులై 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది. డీఏ కోసం గ‌త కొద్ది నెల‌ల నుంచి ఎదురుచూస్తున్న ల‌క్ష‌లాది మంది ఉద్యోగుల‌కు కేంద్రం నిర్ణ‌యం ఎంతో ఊర‌ట‌నిచ్చింది.
\