లక్నోలో ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

వరుస బాంబు పేలుళ్లు చేసి, యూపీని అతలాకుతలం చేద్దామనుకున్న అల్‌ఖైదా ఉగ్రవాదుల వ్యూహాన్ని యూపీ ఏటీఎస్ పోలీసులు తుత్తునీయలు చేశారు. లక్నోలోని దుబగ్గా రింగ్‌రోడ్డులోని సీతాబీహార్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను, ప్రెషర్ కుక్కర్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దుబగ్గా రింగురోడ్డు ప్రాంతానికి సమీపంలో ఉన్న మూడు ఇళ్లను ఏటీఎస్ కమాండోలు చుట్టుముట్టి, తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాదులు యూపీతో సహా ఇతర ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు భారీ కుట్రను రచించారు. 

అలాగే బీజేపీకి చెందిన కీలక వ్యక్తులను హతమార్చడానికి కూడా ప్లాన్ వేశారని  పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఆ మూడు ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత పశ్చిమ యూపీ ప్రాంతాల్లో ఏటీఎస్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. 

మరోవైపు షాహిద్, రియాజ్ అనే ఉగ్రవాదులను మరింత లోతుగా ప్రశ్నిస్తున్నామని ఏటీఎస్ పోలీసు అధికారులు పేర్కొన్నారు.