టికాయత్‌ మాటలు అదుపులో పెట్టుకో

భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్‌ మాటలు అదుపులో పెట్టుకోవాలని, ఆయన వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్‌కుమార్ చాహర్ హెచ్చరించారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కొద్ది రోజులుగా రాకేశ్ టికాయత్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. 

దేశ గౌరవాన్ని కాపాడే విధంగా వ్యాఖ్యానించాలని, లేని పక్షంలో ప్రజలు సమాధానం చెప్తారని ఆయన వారించారు. ‘‘దేశాన్ని అవమానించడానికి రాకేశ్ టికాయత్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా?” అంటూ ప్రశ్నించారు.

ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆయన వ్యాఖ్యలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయనే విషయాన్ని గమనించాలని హితవు చెప్పారు. ప్రతిసారి ఏవో వ్యాఖ్యలు చేయడం తర్వాత వాటికి సమాధానం ఇచ్చుకోవడం. రైతు ఉద్యమం అని చెప్పుకుంటున్న ఓ ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఈ విధంగానే సమాధానం చెప్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు.

“ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది?’’ అని రాజ్‌కుమార్ చాహర్ నిలదీశారు. ‘‘అసలు రాకేశ్‌కు ఏమైంది? మహాత్మ మహేంద్ర సింగ్ టికాయత్ ఆత్మ ఈరోజు కాలిపోయింది. ఆయన కోరుకున్న విధంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించారు. కానీ రాకేశ్ టికాయత్ ఇలా ఎందుకు నానాయాగీ చేస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని రాజ్‌కుమార్ చాహర్ విస్మయం వ్యక్తం చేశారు.