`పద్మ’ అవార్డు లకు నామినేషన్లు ఆహ్వానించిన ప్రధాని 

క్షేత్ర స్థాయిలో అసాధారణ కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు, దేశానికి సేవలందిస్తున్నవారిని ‘పద్మ’ పురస్కారాల కోసం సూచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. విశిష్ట సేవలందించినవారిని గౌరవించేందుకు ఇచ్చే ఈ పురస్కారాలు ఎవరికి దక్కితే బాగుంటుందని భావిస్తే, వారి పేర్లను సూచించాలని ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ ఇచ్చారు.

‘‘క్షేత్ర స్థాయిలో అసాధారణ కృషి చేసే అనేక మంది ప్రతిభావంతులు భారత దేశంలో ఉన్నారు. అయితే వీరి గురించి మనకు అంతగా తెలియదు, మనం గమనించం. ప్రేరణనిచ్చే వ్యక్తుల గురించి మీకు తెలుసా? #PeoplesPadmaకు వారిని మీరు నామినేట్ చేయొచ్చు. సెప్టెంబరు 15 వరకు నామినేషన్లు పంపవచ్చు’’ అని మోదీ పేర్కొన్నారు. 

‘పద్మ’ పురస్కారాలను 1954లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా వీటిని ప్రకటిస్తుంది.  సమాజనికి విశిష్ట సేవలందించినవారికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పౌర పురస్కారాలను ప్రభుత్వం ఇస్తుంది. సమాజ సేవకు తమ జీవితాలను అంకితం చేసినప్పటికీ, వార్తల్లో ప్రచారం పొందని అనేక మందికి మోదీ ప్రభుత్వం గడచిన కొన్నేళ్ళలో ఈ పురస్కారాలను ఇచ్చి గౌరవించింది.