రాంకీ గ్రూప్‌లో రూ.300 కోట్ల నల్లధనం

రాంకీ సంస్థలపై ఐటీ దాడుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంకీ గ్రూప్‌లో రూ.300 కోట్ల నల్లధనం వెలికితీసినట్టు కేంద్ర ఆదాయ పన్నుశాఖ వెల్లడించింది. రూ.1200 కోట్లు కృత్రిమ నష్టం చూపి పన్నులు ఎగ్గొట్టినట్లు నిర్ధారించామని పేర్కొంది.
 
 రాంకీ సంస్థ ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపెట్టిందని ఐటీ శాఖ ఆరోపించింది. రూ.1200 కోట్లు కృత్రిమ నష్టాన్ని చూపిందని తెలిపింది. రాంకీలోని మేజర్ వాటాను సింగపూర్‌కు చెందిన వ్యక్తులకు అమ్మేశారంది. తప్పుడు లెక్కలు చూపించి రూ.300 కోట్లు పన్ను ఎగవేసేందుకు యత్నించినట్లుగా గుర్తించామంది.
 
అంతేకాకుండా రూ.288 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను నాశనం చేసిందని ఐటీ శాఖ తెలిపింది. రాంకీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లతో పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో ప్రాజెక్ట్ చేపట్టిందని చెప్పింది. 
 
రూ. 300 కోట్ల నల్లధనానికి పన్ను చెల్లించేందుకు. రాంకీ సంస్థ అంగీకరించినట్లు వెల్లడించింది. ఈ నెల 6న హైదరాబాద్‌లో రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అక్రమ ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు నిరూపించే పలు డాక్యుమెంట్లు ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. 
 
రాంకీ చైర్మన్‌  అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.