వైఎస్‌ సంక్షేమ పాలన తెస్తానన్న షర్మిల .. బిజెపి ఎద్దేవా

వైఎస్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని తాను స్థాపిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిల గురువారం సాయంత్రం ప్రకటించగా, ఆ పార్టీ ఆవిర్భావం ఓ సినిమా ఆడియో ఫంక్షన్ వలే జరిగిన్నట్లు బిజెపి ఎద్దేవా చేసింది.

వైఎస్‌ చేసిన సంక్షేమ సంతకం ఇప్పటికీ రోల్‌మోడల్‌ అని తెలిపిన షర్మిల తిరిగి సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకు తమ పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం పోలేదని,  తెలంగాణలో ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ పాలనను తలచుకుంటున్నారని అనే  చెప్పారు. అయితే ఆమె పార్టీ కి ఓ సిద్ధాంతం లేదని, ఆ పార్టీ ప్రారంభిస్తున్న ఆమెకు  తెలంగాణతో సంబంధమూ లేదని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావు స్పష్టం చేశారు. మొత్తం పార్టీ ఆవిర్భావ  కార్యక్రమం పసలేని సాగదీత డైలీ టీవీ సీరియల్ లాగా ఉందని తెలిపారు.

మరోవంక, షర్మిల కేసీఆర్ పాలనపై మండిపడుతూ సంక్షేమ పాలనలో కేసీఆర్‌ విఫలమయ్యారని చెప్పారు. కేసీఆర్‌ సంక్షేమమంటే గారడిమాటల గొప్పలు..చేతికి చిప్పలు అని ఎద్దేవా చేశారు.  పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ లక్ష్యం అని ఆమె ప్రకటించారు. ఇంటికో ఉద్యోగమని కేసీఆర్‌ వాగ్దానం చేశారని, ఇప్పటివరకు ప్రకటనలు లేవు..ఉద్యోగాలు రావు అని ధ్వజమెత్తారు.

మరోవంక, తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలనకు పునాదులు పడబోతున్నాయని వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ జెండాను ఆమె ఆవిష్కరిస్తూ  ఆమె మాట్లాడుతూ   తండ్రి కలలు సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి షర్మిల వచ్చిందని స్పష్టం చేశారు. అయితే,  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే ఆలోచనకే బద్ద వ్యతిరేకి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని బీజేపీ నేత కృష్ణసాగరరావు  గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడానికి తన శాయ శక్తుల ప్రయత్నించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను  వ్యతిరికించిన నాయకుడు అని పేర్కొన్నారు.

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని తిరిగి తెలంగాణ లో తీసుకువస్తానంటున్న షర్మిల వ్యూహం బెడిసికొడుతుందని ఆయన స్పష్టం చేశారు. షర్మిల పార్టీకి తెలంగాణ లో స్థానం కానీ, అవసరం కానీ,చోటుకానీ లేవని తేల్చి చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే షర్మిల పార్టీ అనేది ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ లో రాష్ట్రం లో స్వయం ఉపాధి పథకం లాంటిదని కృష్ణసాగరరావు విమర్శించారు.