హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ హతం

ఉగ్రవాద నిర్మూలణలో భద్రతా దళాలు మరోమారు పైచేయి సాధించాయి. హిజ్బుల్ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ మెహ్రాజుద్దీన్‌ హల్వాయిని మట్టుబెట్టాయి. బుధవారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మెహ్రాజుద్దీన్‌ హల్వాయి అలియాస్‌ ఉబైద్‌ హతమయ్యాడు. ఉబైద్‌ అనేక ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇది తమకు చాలా పెద్ద విజయమని ట్వీట్‌ చేశారు.
 
మరోవంక, కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు. ఈ క్రమంలో సాంబా, రాంబన్‌, బారాముల్లా జిల్లాల్లో డ్రోన్లు, ఇతర చిన్నస్థాయిలో ఎగిరే వస్తువుల అమ్మకాలు, నిల్వ, వినియోగంపై అధికారులు నిషేధం విధించారు. 
 
ఐఎఎఫ్ స్టేషన్ వద్ద సాయుధ డ్రోన్లతో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత శ్రీనగర్ సరిహద్దు జిల్లాలైన రాజౌరి, కథువాలోని అధికారులు ఇప్పటికే నిషేధంను అమలులోకి తీసుకువచ్చారు. బారాముల్లాలో డ్రోన్ కెమెరాలు, ఎగిరే వస్తువులు ఉన్న వారు స్థానిక పోలీసు స్టేషన్లలో జమ చేయాలని ఆదేశించారు. 
 
డ్రోన్ కెమెరాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాటిని వినియోగించుకునే ప్రమాదం ఉన్నందున ఈ నిషేధం విధించినట్లు రాంబన్‌ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఇటీవల జమ్మూ ఐఏఎఫ్‌ స్టేషన్‌లో డ్రోన్లతో బాంబు దాడులకు దిగగా.. ఇద్దరు సిబ్బందికి గాయాలు కాగా.. ఓ భవనం పైకప్పు కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.