భూముల వేలం ఆపాలంటూ విజయశాంతి పిటిషన్

తెలంగాణలోని భూముల వేలాన్ని ఆపాలంటూ బీజేపీ సీనియర్ నేత విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ 25 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను ఆపాలని పిటిషన్‌లో కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం భూములు అమ్ముతున్నారని ఆరోపించారు. 

అలాగే నిధుల కోసమే ప్రభుత్వం ఈ పని చేస్తోందని కూడా విజయశాంతి తన పిటిషన్‌లో ఆరోపించారు. భవిష్యత్తులో ఏ ఆస్పత్రిని కట్టాలన్నా, విద్యా సంస్థలు నిర్మించాలన్న భూములెక్కడి నుంచి వస్తాయని విజయశాంతి ప్రశ్నించారు.

కాగా, తెలంగాణలో రెవిన్యూ వ్యవస్థ రైతుల పాలిట ఎంత శాపంగా మారిందో చెప్పడానికి తాజా ఉదంతాలు చాలని, అవే నిలువెత్తు సాక్ష్యాలని విజయశాంతి మండిపడ్డారు. తాజాగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భూ సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక ఓ మహిళ ఏకంగా తహశీల్ కార్యాలయం గుమ్మానికి తాళిబొట్టును వేలాడదీసిందని ఆమె గుర్తు చేశారు.

అంతకు ముందు మెదక్ జిల్లాలోని తండాలో పట్టాదారు పాస్‌బుక్ రావడంతో మాలోత్ బాబు అనే రైతు మరణించారని ఆమె తెలిపారు. రాష్ట్రమంతటా రైతులకు ప్రతిరోజూ ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొద్దిమంది రైతులకు రైతుబంధు అందినా, వాటిని పాత బాకీల కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని ఆమె వాపోయారు.

అసలు కేసీఆర్ సర్కార్ సక్రమంగా రుణమాఫీ చేస్తే, ఇలాంటి దుస్థితే ఉండేది కాదని ఆమె స్పష్టం చేశారు. వీటితో పాటు నకిలీ విత్తనాల సమస్య, పంట కొనుగోళ్ల ఇబ్బందులు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఇవన్నీ ఓ వైపు అని, ధరణి వెబ్‌సైట్ సాంకేతిక సమస్యలతో పాటు ప్రజలను, రైతులను ముప్పుతిప్పలు పెడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకు ఇవే ప్రత్యక్ష తార్కాణాలని, ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.