మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధర

దేశంలో పెట్రోల్‌ ధరల్ని చకచకా 100 రూపాయిల్ని దాటించిన ముడి చమురు ధర మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం76 డాలర్ల స్థాయిని దాటింది. ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్సేంజ్‌లో బ్యారల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర 2.5 శాతం పెరిగి మూడేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 76.71 డాలర్ల వద్దకు చేరింది. 

2018 అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర ఇలానే పెరుగుతూపోతే, రానున్న రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.120కి వెళ్ళినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 52 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్‌ క్రూడ్‌  కేవలం ఐదున్నర నెలల్లో 47 శాతం ఎగిసింది.

క్రూడ్‌ ఉత్పాదక దేశాలమండలి ఒపెక్‌ చమురు ఉత్పత్తిని అంచనాలకు అనుగుణంగా పెంచకపోవచ్చన్న వార్తలతో తాజాగా పెరిగింది. రష్యా కూడా ఉత్పత్తిని పెద్దగా పెంచదన్న వార్తలు ముడి చమురుకు మరింత ఆజ్యం పోశాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.102 దాటిన పెట్రోల్‌, రూ.97 దాటిన డీజిల్‌ ధరలు  ప్రపంచ మార్కెట్‌ ప్రభావంతో మరింత పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

అలాగే రూపాయి క్షీణత సైతం దేశీయంగా ఇంధన ధరలు పెరగడానికి మరో కారణమవుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రస్తుతం రికార్డు గరిష్ఠం వద్దనున్నప్పటికీ, అంతర్జాతీయ ధరల కంటే తక్కువగానే ఉన్నట్లు చమురు మార్కెటింగ్‌ సంస్థలు అంటున్నాయి. అంటే మున్ముందూ వడ్డనలుంటాయని భావించవచ్చు. అయితే సుంకాల్ని తగ్గిస్తే సామాన్యులకి ఊరట లభించవచ్చు.