ఎవరైనా చైనాను వేధించాలనుకుంటే తలపగులడం ఖాయం 

ఎవరైనా చైనాను వేధించాలనుకుంటే తలపగులడం ఖాయమని ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. చైనా ఎప్పుడూ ఏ ఇతర దేశాన్ని వేధించలేదని, అణచివేయలేదని, అలాగే చైనాపై ఏ ఇతర దేశాన్నీ అలాంటి చర్యలకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

‘ఒకవేళ ఎవరైనా ఆ దుస్సాహసానికి ప్రయత్నిస్తే 140 కోట్ల మంది చైనా ప్రజలు నిర్మించిన ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌’ను ఢీకొని తలపగులడం తథ్యమ’ని తేల్చి చెప్పారు. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చరిత్రాత్మక తియాన్మెన్‌ స్క్వేర్‌లో 70 వేల మందితో భారీ సభ నిర్వహించారు.

‘చైర్మన్‌’ మావో జెడాంగ్‌ భారీ చిత్తరువుతో అలంకరించిన తియాన్మెన్‌ గేట్‌ బాల్కనీ నుంచి, మావోను తలపించే ఆహార్యంతో జిన్‌పింగ్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్లైపాస్ట్‌లో 71 విమానాలు పాల్గొన్నాయి. తమ అభివృద్ధికి అమెరికా అడ్డు తగులుతున్నదంటూ చైనా చెబుతుండటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చైనాను లొంగదీసుకోవడం, బెదిరించడం, అణచివేయడం లాంటి ప్రయత్నాలను సహించేది లేదంటూ జిన్‌పింగ్‌ స్వరం పెంచారు. తైవాన్‌ విలీనానికి కట్టుబడి ఉన్నామంటూ దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకుంటామని వెల్లడించారు.

చైనా ప‌ట్టుద‌ల‌ను ఎవ‌రూ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌రాదు అని, దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని, జాతి స‌మ‌గ్ర‌త‌ను కాపాడుకునేందుకు చైనా ప్ర‌జ‌లు వెనుక‌డుగు వేయ‌ర‌ని స్పష్టం చేశారు. తైవాన్ ఏకీక‌ర‌ణ విష‌యంలో త‌మ‌ల్ని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని చెప్పారు.కేవ‌లం సోష‌లిజం మాత్ర‌మే చైనాను ర‌క్షిస్తుంద‌ని, సోష‌లిజం మాత్ర‌మే చైనాను అభివృద్ధిప‌థంలో న‌డిపిస్తుంద‌ని ఆయ‌న ప్రకటించారు.

దేశ ప్ర‌జ‌ల‌ను మెచ్చుకున్న జిన్‌పింగ్‌.. వాళ్లు కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించిన‌ట్లు చెప్పారు. కానీ క‌మ్యూనిస్టు పార్టీ లేకుండా ఆ ప్ర‌పంచాన్ని సృష్టించ‌డం సాధ్యం అయ్యేది కాద‌ని తేల్చి చెప్పారు.