కూర్చునేందుకు కుర్చీలే లేని ఆర్టీఐ కమిషనర్లు 

సమాచార హక్కు చట్టాన్ని పర్యవేక్షించి, దానిని అమలుచేసేలా చూడాల్సిన ఆర్టీఐ కమిషనర్లకు  కూర్చునేందుకు కుర్చీలే లేని దుస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో  ఏర్పడింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఏపీ మాన వ హక్కుల కమిషన్ కార్యాలయంలో చైర్మన్, సభ్యులకు కూర్చునేందుకు గదులు, స్టాఫ్ కేటాయించని వైనం విమర్శలకు తావిస్తోంది. అది చివరకు హైకోర్టు వరకూ వెళ్లింది. 

దానికితోడు విజయవాడ లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్‌కు పీఏ, అటెండర్ కూడా లేకపోవడం ప్రభుత్వానికి అప్రతిష్ఠగా మారింది. తాజాగా ఆ అప్రతిష్ఠల పర్వంలోకి ఆర్టీఐ ప్రధాన కార్యాలయం కూడా చేరింది. రాష్ట్ర విభజన తర్వాత మంగళగిరిలో ఆర్టీఐ ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారు.

చంద్రబాబునాయుడు హయంలో చీఫ్ కమిషనర్ లేకుండానే  ప్రముఖ న్యాయవాది కట్టా జనార్దన్‌రావు, రిటైర్డ్ ఐపిఎస్ బివి రమణకుమార్, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ మాతంగి రవికుమార్, ఐలాపురం రాజాను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారు. అప్పటివరకూ వారికి వేతనాలతో పెద్దగా సమస్య రాలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఆర్టీఐకి కొంతకాలం కష్టాలు వచ్చి పడ్డాయి.

గత ప్రభుత్వం నియమించిన ఆర్టీఐ కమిషనర్లకు చాలాకాలం పాటు వేతనాలు నిలిపివేశారు. అది మీడియాలో వెలుగుచూడటంతో, తర్వాత వారికి వేతనాలు సక్రమంగానే చెల్లిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగాల్ క్యాడర్‌లో పనిచేసి రిటైరయిన, కడపకు చెందిన రమేష్‌కుమార్‌ను ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా నియమించారు.

మళ్లీ గత నెలలో హరిప్రసాద్‌రెడ్డి, చెన్నారెడ్డిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారు. దానితో మొత్తం 8 మంది కమిషనర్లను నియమించినట్లయింది. వీరందరూ మంగళగిరిలోని ఆర్టీఐ ప్రధాన కార్యాలయం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

సమాచారం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులు, శాఖలకు వాటిని పంపిస్తుంటారు. నిజానికి ఆర్టీఐ కార్యాలయానికి, కమిషనర్లకు రోజూ పనిభారం ఎక్కువే ఉంటుంది. ఇటీవలి కాలంలో సమాచార హక్కు చట్టంపై అన్ని వర్గాల్లో చైతన్యం పెరగడంతో, దరఖాస్తుల సంఖ్య విపరీతంగా పెరగుతున్నాయి.

కాగా నిబంధనల ప్రకారం 10 మంది కమిషనర్లను నియమించుకునే వెసులుబాటు ఉంది. అయితే, గత నెలలో ఆర్టీఐ కమిషనర్లుగా నియమితులయిన హరిప్రసాద్‌రెడ్డి, చెన్నారెడ్డికి ఇప్పటిదాకా రూములు లేకపోవడంతో, వారు కాన్ఫరెన్సు రూములోనే కూర్చుని విధులు నిర్వహించాల్సి వస్తోంది.

ఇప్పటి కార్యాలయంలో తగినన్ని గదులు లేకపోవడం, అందుబాటులో ఉన్న గదులు ప్రస్తుత కమిషనర్లకు సరిపోవడంతో, కొత్తగా వచ్చిన ఇద్దరు కమిషనర్లకు కూర్చునేందుకు సైతం చోటు లేకుండా పోయింది. దీనితో పైన మరొక ఫ్లోర్‌లో కొన్ని గదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మంగళగిరిలోని ఆర్టీఐ ప్రధాన కార్యాలయం ఇప్పటికీ గతంలో ఉన్న ఐదుగురు కమిషనర్ల కాలం నాటి సిబ్బందితోనే పనిచేస్తోంది. గత ప్రభుత్వంలో నియమించిన నలుగురు కమిషనర్లు, తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించిన మరొక కమిషనర్ ఉన్నప్పుడు 65 మంది సిబ్బంది పనిచేసేవారు. 

ఆ తర్వాత కమిషనర్ల సంఖ్య 8 కి చేరినప్పటికీ, అంతే మంది సిబ్బంది ఉండటంతో కార్యాలయంలో పనిభారం పెరిగిపోయింది. ఒక్కో కమిషనర్ వద్ద ఒక పీఏ, పీఎస్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు అటెండర్లు పనిచేస్తుంటారు. ఇప్పుడు గత నెలలో కొత్తగా నియమితులైన ఇద్దరు ఆర్టీఐ కమిషనర్లకు ఇప్పటిదాకా పీఏ, పీఎస్, అటెండర్లు లేరు.

 ప్రస్తుతం ఉన్న పనిభారం దృష్ట్యా, కనీసం మరో 40 మందిని నియమించాల్సిన అవసరం ఉందని కార్యాలయ అధికారి ఒకరు వివరించారు.  అప్పీల్‌తోపాటు ఫిర్యాదులు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్లనే, తమపై పనిభారం ఎక్కువయింద ని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.