టిటిడిస్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటుపై అనుమానాలు!

ఈ నెల 21తో పదవీకాలం ముగిసిన టిటిడి ట్రస్ట్ బోర్డు స్థానంలో కొత్త పాలకమండలిని నియమించకుండా, ఇద్దరు సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టిటిడి నిధులను ప్రభుత్వ కార్యకలాపాలకు తరలించడం కోసమే ఈ విధంగా చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 

సాధారణంగా స్పెసిఫైడ్ అథారిటీని గతంలో ఎప్పుడు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేస్తుండేవారు. వారిలో టిటిడి నుండి కార్యనిర్వహణ అధికారి ఒక్కరు మాత్రమే ఉండేవారు. రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి, ఎండోమెంట్ కార్యదర్శిలను మరో ఇద్దరు సభ్యులుగా నీయమిస్తుండేవారు. 

కానీ ఈ పర్యాయం స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఇఓ కెఎస్‌.జవహర్‌రెడ్డి, కన్వీనర్‌గా అదనపు ఇఓ ఎవి ధర్మారెడ్డిలు శ్రీవారి ఆలయంలో గురువారం(జూన్ 24) ప్రమాణస్వీకారం చేశారు. వారిద్దరూ టిటిడి ఉన్నతాధికారులే కావడం గమనార్హం. దానితో ఉన్నత అధికారుల అజమానుషే లేకుండా పోతుంది.

ఇలా ఉండగా, టీటీడీకి నూతన బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీతో కొత్త వివాదానికి తెరదీశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 

చట్టాన్ని అపహాస్యం చేసేలా 146 జీవో విడుదల చేశారన్నారు. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికే జీవో అన్న అభిప్రాయం ఉందని విమర్శించారు. హిందూ ధర్మం ఆచరించే పలువురి నమ్మకాలను గాయపరుస్తోందని రఘురామ స్పష్టం చేశారు. 

ఇద్దరు సభ్యులతో అథారిటీ ఏర్పాటు చేస్తే నిర్ణయాలపై చర్చకు వీలుండదని, ట్రస్టు బోర్డు అధికారాలను అథారిటీకి బదిలీ చేసినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. అథారిటీకి ఆర్థిక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని తీసేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త బోర్డు ఏర్పడ్డాకే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. 

కాగా,  శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయని బీజేపీ నేత భాను ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. కరోనా కారణంగా టీటీడీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని పేర్కొంటూ గరుడ వారధి నిర్మాణానికి శ్రీవారి నిధులు కేటాయిస్తున్నారని  అభ్యంతరం వ్యక్తం చేశారు. 

భక్తులు సమర్పించే నిధులు ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని స్పష్టం చేశారు. గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగిస్తే పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.  గరుడ వారధి పొడిగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కళ్యాణమండపాలు ఖాళీగా వుంటే, తిరిగి కొత్తగా కళ్యాణమండపాలు నిర్మించాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ వెంటనే వెనక్కి తీసుకోవాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.