రాయ‌లసీమ ఎత్తిపోత‌ల చేప‌డితే ఏపీ సీఎస్ జైలుకే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టుపై జాతీయ హ‌రిత‌ ట్రిబ్యున‌ల్ ( ఎన్జీటీ ) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాల‌కు విరుద్ధంగా ప‌నులు చేప‌డితే ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని జైలుకు పంపించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

ఎన్జీటీ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తూ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నులు చేస్తున్నార‌ని తెలంగాణ వాసి గ‌వినోళ్ల శ్రీనివాస్ ధిక్క‌ర‌ణ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఈ ధిక్క‌ర‌ణ పిటిష‌న్‌ను చెన్నై ఎన్జీటీ ఇవాళ విచారించింది.

 పనులను నిలిపివేసి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని ఎన్‌జీటీకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వ వాదనలపై అనుమానాలు వ్యక్తం చేసింది ఎన్‌జీటీ. రాయలసీమ పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ ప్రాంతీయ కార్యాల‌యానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.

త‌దుప‌రి విచార‌ణ‌ను జులై 12కి ఎన్జీటీ వాయిదా వేసింది. ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేకుండా ప‌నులు జ‌ర‌పొద్ద‌ని గ‌తంలోనే ఏపీ ప్ర‌భుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.