ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

10వ తరగతి, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే ఒక్క విద్యార్థి చనిపోయినా ఉపేక్షించేదిలేదని, ఒక్కో విద్యార్థికి రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశాలిస్తామన్న సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సి వచ్చింది.

పరీక్షలకే కట్టుబడి ఉన్నా సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా ఏర్పాట్ల వివరాలేవీ లేకపోవడంతో శుక్రవారం ఉదయంలోగా అఫిడవిట్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర  ప్రభుత్వానికి అర్ధాంతరంగా పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితి సృష్టించింది.

ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదని హామీ ఇచ్చారు. అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని తెలిపారు.

జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని మంత్రి సురేశ్ తేల్చి చెప్పారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలకు 45 రోజుల సమయం పడుతుందని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ అసాధ్యమని, మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతామని మంత్రి తెలిపారు.

కాగా కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. అయినా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధపడింది. దీంతో పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.